తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేర్చడం కాంగ్రెస్ వల్లే సాధ్యం - మీరా కుమార్
తెలంగాణ ప్రజలు ఏ లక్ష్యం కోసం కొట్లాడి స్వరాష్ట్రాన్ని సాధించుకున్నారో అది నెరవేరలేదని లోక్ సభ మాజీ స్పీకర్ మీరా కుమార్ అన్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ నిర్వహిస్తున్న కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గన్ పార్క్ వద్ద అమర వీరుల స్థూపానికి నివాళులర్పించిన అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. ఈ సందర్భంగా తెలంగాణ ఏర్పాటులో కాంగ్రెస్ పాత్రను గుర్తు చేసుకున్నారు.
అన్ని వర్గాల ప్రజల పోరాటాన్ని చూసి కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చిందని మీరాకుమార్ అన్నారు. ఇందుకోసం ఆ పార్టీ ఎంతో త్యాగం చేసిందని చెప్పారు. తెలంగాణ ప్రజల ఆశయాలకు అనుగుణంగా దేశంలోనే రాష్ట్రం నెంబర్ 1గా మారాలంటే కాంగ్రెస్ అధికారంలోకి రావాలని అన్నారు. ఇక్కడి జనం చేసిన త్యాగాలు, ఆశయాలు ఒక్క హస్తం పార్టీకి మాత్రమే తెలుసన్న మీరా కుమార్.. వాటిని నెరవేర్చడం కాంగ్రెస్ వల్లే సాధ్యమని చెప్పారు.
గన్ పార్క్ వద్ద నివాళులర్పించిన అనంతరం ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా కాంగ్రెస్ చేపట్టిన పాదయాత్రను మీరా కుమార్ ప్రారంభించారు. బషీర్ బాగ్లోని బాబూ జగ్జీవన్ రాం విగ్రహం నుంచి మొదలైన యాత్ర గన్ ఫౌండ్రీ, ఆబిడ్స్, మొజంజాహి మార్కెట్ మీదుగా గాంధీభవన్ చేరుకోనుంది. అనంతరం అక్కడ నిర్వహించే కార్యక్రమంలో ఆమె పాల్గొననున్నారు. వేడుకల్లో భాగంగా తెలంగాణ ఉద్యమంలో కీలక పాత్ర పోషించిన వారిని సన్మానించనున్నారు.