Lulu Mall: అతి పెద్ద షాపింగ్ మాల్... హైదరాబాదీల అవస్థలు
యూఏఈకి చెందిన లులూ గ్రూప్.. రూ.300 కోట్లతో హైదరాబాద్‌లోని కూకట్‌పల్లిలో లులూ మాల్‌ను ప్రారంభించిన సంగతి తెలిసిందే. గత నెల 27 న రాష్ట్ర పరిశ్రమల మంత్రి కేటీఆర్ చేతుల మీదుగా ఓపెన్ అయిన ఈ మాల్.. ఇప్పుడు నగరవాసులకు చుక్కలు చూపిస్తోంది. కూకట్‌పల్లితో పాటు పరిసర ప్రాంతాల ప్రజలు.. ఈ షాపింగ్ మాల్ కారణంగా ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతున్నారు.
నిన్న ఆదివారం కావడంతో ఆ మాల్‌ను సందర్శించేందుకు ప్రజలు పొటెత్తారు. దీంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. గత ఐదు రోజులుగా మధ్యాహ్నం 12 గంటల నుంచి మొదలుకొని.. సుమారు రాత్రి 11 గంటల వరకు ట్రాఫిక్‌తో నానాపాట్లు పడుతున్నామని స్థానికులు వాపోతున్నారు. మాల్ కు విపరీతంగా జనాల తాకిడి, రోడ్డు పక్కనే పార్కింగ్ చేయడంతో ఈ పరిస్థితి ఏర్పడినట్లు తెలుస్తోంది.
సాయంత్రం పూట హైటెక్‌సిటీ నుంచి జేఎన్టీయూ వైపు.. హైదరాబాద్ నుంచి మియాపూర్ వైపుగా వచ్చేందుకు.. ట్రాఫిక్‌లో ఇరుక్కుని నానా కష్టాలు పడుతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూసాపేట్ నుంచి KPHB వెళ్లడానికి గంటకు పైగా సమయం పట్టిందని ఓ వాహనదారుడు వాపోయాడు. ఈ విషయం తెలిసి చాలా మంది కనీసం ఇంటిలో నుంచి బయటకు వచ్చేందుకు భయపడాల్సిన పరిస్థితి వచ్చిందని వాపోయారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి.. ఆ మాల్ నిర్వాహకులతో చర్చించాలని అంటున్నారు. తదనగుణంగా సరైన చర్యలు చేపట్టాలని స్థానికులు కోరుతున్నారు. మరోవైపు ఈ విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు.. ట్రాఫిక్‌ను క్రమబద్ధీకరించేందుకు చర్యలు చేపట్టారు.