కేసీఆర్ ఫాంహౌస్లో ఈడీ రైడ్స్ చేస్తే వేల కోట్లు బయటపడుతయ్: మధుయాష్కీ గౌడ్
బీఆర్ఎస్ అధినేత, మాజీ సీఎం కేసీఆర్ పై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ మధుయాష్కీ గౌడ్ నిప్పులు చెరిగారు. బీఆర్ఎస్ హయాంలో వేల కోట్ల అవినీతి జరిగిందని.. అధికారులు, నేతలే ప్రజల సొమ్మును దోచుకుతిన్నారన్నారు. కేసీఆర్ పెంచిన కుక్క సోమేశ్ కుమార్ అని మధుయాష్కీ ఆరోపించారు. మంగళవారం రవీంద్రభారతిలో తెలంగాణ ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జేఏసీ రాష్ట్ర స్థాయి ఆత్మీయ సభలో పాల్గొన్న ఆయన.. బీఆర్ఎస్ పై పలు ఆరోపణలు చేశారు. గత ప్రభుత్వంలో సీఎస్ సోమేశ్ కుమార్ బిస్కెట్ల ఖర్చే రూ. 9 కోట్లు అయిందని విమర్శలు గుప్పించారు. ఇక మాజీ హెఎండీఏ అధికారి ఇంట్లో కోట్ల నగదు పట్టుబడిందని, బీఆర్ఎస్ పాలనలో అంతా అవినీతి జరిగిందన్నారు. అధికారులు, నేతల వద్దే ఇంత అవినీతి సొమ్ము ఉంటే.. కేసీఆర్ దగ్గర ఇంకా ఎన్నివేల కోట్లు ఉంటాయో ఊహకందడం లేదని ఆరోపించారు. కేసీఆర్ ఫాంహౌస్ లో ఈడీ రైడ్స్ చేస్తే వేల కోట్లు పట్టుబడతాయని మధుయాష్కీ చెప్పుకొచ్చారు.
కేసీఆర్ ప్రభుత్వంలో సీఎస్‌గా ఉన్న సోమేశ్ కుమార్.. రంగారెడ్డి జిల్లా యాచారంలో అక్రమంగా భూముల కొనుగోలు చేశారని ఆరోపణలు ఉన్నాయి. ఆ ప్రాంతంలో ఫార్మాసిటీ ఏర్పాటవుతుందని ముందే గ్రహించి పక్కా ప్లాన్ ప్రకారం 2018లోనే ఆ భూములను కొన్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ వ్యవహారంపై ప్రభుత్వం ఆరా తీస్తుంది. అలా అక్రమంగా కొనుగోలు చేసిన భూముల ద్వారా డీఓపీటీ అనుమతి లేకపోయినా రూ.లక్షల్లో రైతుబంధు సొమ్ములను తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. కొత్తపల్లి విలేజ్ లో కొనుగోలు చేసిన భూమిపై ఇప్పటివరకు రైతుబంధు 14 లక్షలు తీసుకున్నారని ప్రభుత్వం గుర్తించింది. భూమి సాగు చేయకపోయినా రైతుబంధు తీసుకోవడాన్ని తప్పుబడుతున్నారు. ఆయన భార్య పేరుమీద కూడా కోట్ల విలువైన భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు ఉన్నాయి. దీంతోపాటు చాలామంది సోమేశ్ కుమార్ పై ఈడీ, సీబీఐకి ఫిర్యాదు చేశారు.