Dharani Portal Issues : ప్రజావాణికి వినతుల వెల్లువ.. ఆ రెండింటిపైనే ఎక్కువ ఫిర్యాదులు

Byline :  Kiran
Update: 2024-01-23 10:00 GMT

తెలంగాణలో అధికారం చేపట్టిన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారంపై దృష్టి సారించింది. ఇందులో భాగంగా ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. ప్రగతిభవన్‌ను జ్యోతిరావ్‌ పూలే ప్రజా భవన్‌గా పేరు మార్చిన సర్కారు అక్కడే ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తోంది. సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం చేపట్టిన ఈ కార్యక్రమానికి అనూహ్య స్పందన లభిస్తోంది. తమ సమస్యల పరిష్కారం కోసం రాష్ట్రం నలుమూలల నుంచి జనం తరలివస్తున్నారు.

రాష్ట్రంలో అధికారం చేపట్టిన వెంటనే రేవంత్ రెడ్డి సర్కారు ప్రజాదర్భార్‌ పేరుతో ఈ కార్యక్రమం మొదలుపెట్టింది. తొలిరోజు ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి స్వయంగా ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకున్నారు. వారి సమస్యలు పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అయితే కొన్నాళ్లకు ప్రజా దర్భార్‌ పేరును.. ప్రజావాణిగా మార్చారు. వారంలో ప్రతి మంగళ, శుక్రవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఒక్కో రోజు ఒక్కో మంత్రి ప్రజావాణిలో పాల్గొని ప్రజా సమస్యలు తెలుసుకోవాలని... వారి నుంచి వినతిపత్రాలు తీసుకోవాలని సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశించారు. ప్రజావాణి జరిగే రోజు కచ్చితంగా ఓ మంత్రి హాజరవుతూ.. ప్రజల నుంచి వినతిపత్రాలు తీసుకుంటున్నారు. మంగళవారం జరిగిన ప్రజావాణిలో లైన్ మెన్ ఉద్యోగులు, నర్సింగ్ స్టాఫ్ తో పాటు కొందరు నిరుద్యోగులు వచ్చి తమ వినతి పత్రాలు అందజేశారు.

ప్రజావాణిలో భూవివాదాలు, ధరణి పోర్టల్కు సంబంధించిన ఫిర్యాదులే ఎక్కువగా వస్తున్నాయి. నిజానికి ఈ కార్యక్రమం నిర్వహించిన తొలినాళ్లలో ప్రజాభవన్ బయట భారీ క్యూలైన్ ఉండేది. అయితే ఇప్పుడు అంత రద్దీ కనిపించడం లేదు. అయితే సమస్యల పరిష్కారం కోసం సుదూర ప్రాంతాల నుంచి తరలిరావాల్సి వస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో ప్రజల సౌకర్యార్థం హైదరాబాద్లోని ప్రజాభవన్తో పాటు జిల్లాల్లోనూ ప్రజావాణి కార్యక్రమం చేపట్టాలన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాలకు చెందిన ప్రజలు వినతి పత్రాలు ఇచ్చేందుకు గంటల తరబడి ప్రయాణించి హైదరాబాద్ కు రావాల్సి వస్తోందని, దానికి బదులుగా నియోజకవర్గాల్లోని ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీసుల్లో ప్రజావాణి నిర్వహిస్తే మంచిదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.




Tags:    

Similar News