బీజేపీలో చేరిన మంద కృష్ణ మాదిగ సోదరుడు

By :  Krishna
Update: 2023-11-25 15:47 GMT

ఎమ్మార్పీఎస్ అధ్యక్షుడు మంద కృష్ణ మాదిగ సోదరుడు మంద కార్నెల్ బీజేపీలో చేరారు. ఈటల రాజేందర్ సమక్షంలో ఆయన కమలం కండువా కప్పుకున్నారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ప్రధాని మోదీ తీసుకుంటున్న చర్యలను చూసి కార్నెల్ బీజేపీలో చేరారని ఈటల అన్నారు. కార్నెల్‌కు బీజేపీలో సముచిత స్థానం కల్పిస్తామని చెప్పారు. రాష్ట్రంలో బీజేపీ గాలి వీస్తోందని.. వచ్చే ఎన్నికల్లో బీజేపీ జెండా ఎగరడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు.

మరోవైపు ఎస్సీ వర్గీకరణపై ప్రధాని మోదీ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎస్సీ వర్గీకరణపై కమిటీ ఏర్పాటు చేయాలని ఉన్నతాధికారులను ఆదేశించారు. శుక్రవారం కేబినెట్ సెక్రటరీతో పాటు సంబంధిత అధికారులకు ప్రధాని ఆదేశాలు జారీ చేశారు. ఎస్సీ వర్గీకరణ ప్రక్రియ వేగవంతం చేయాలని ఈ సందర్భంగా అధికారుకులకు మోదీ సూచించారు. దీనిపై ఎమ్మార్పీఎస్ నాయకులు హర్షం వ్యక్తం చేశారు.

కాగా.. ఈ నెల 11న సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్‌లో జరిగిన మాదిగ విశ్వరూప సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోదీ సంచలన ప్రకటన చేశారు. త్వరలోనే ఎస్సీ వర్గీకరణపై ఒక కమిటీ వేస్తామని హామీ ఇచ్చారు. . ఎస్సీ వర్గీకరణకు కట్టుబడి వున్నామని .. మాదిగలకు న్యాయం చేస్తామని చెప్పారు. ఎస్సీ వర్గీకరణ కోసం చేస్తున్న పోరాటానికి తాము మద్ధతుగా ఉంటామని స్పష్టం చేశారు. ఇందులో భాగంగానే కమిటీ ఏర్పాటులో ఆయన కీలక నిర్ణయం తీసుకున్నారు.

Tags:    

Similar News