తెలంగాణ లో అధికారుల బదిలీలు ఆగడం లేదు. లోక్ సభ ఎన్నికలు దగ్గర పడుతున్న వేళ మరోసారి పలువురు ఐఏఎస్ అధికారులను బదిలీ చేసింది రేవంత్ సర్కార్. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన దగ్గరి నుండి పెద్ద ఎత్తున అన్ని శాఖల్లో అధికారులను బదిలీలు చేస్తూ వస్తుంది. ఇప్పటికే ఎంతోమంది బదిలీలు కాగా..తాజాగా మరో ఐదుగురు ఐఏఎస్‌లను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పలువురు ఐఏఎస్ అధికారులను తెలంగాణ సర్కారు బదిలీ చేసింది.
సిద్దిపేట కలెక్టర్ గా ఉన్న ప్రశాంత్ జీవన్ పాటిల్ నీటి పారుదల శాఖ ప్రత్యేక కార్యదర్శిగా బదిలీ చేశారు. సిద్దిపేట కలెక్టర్ గా మిక్కిలినేని మను చౌదరిని నియమించారు. మను చౌదరి ప్రస్తుతం కామారెడ్డి జిల్లా అదనపు కలెక్టర్ గా ఉన్నారు. వరంగల్ మున్సిపల్ కమిషనర్ షేక్ రిజ్వాన్ బాషాను జనగాం జిల్లా కలెక్టర్ గా బదిలీ చేశారు. పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసుల శాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్న శైలజా రామయ్యర్ కు రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి బాధ్యతలను అదనంగా అప్పగించింది. ఇప్పటి వరకు ఈ బాధ్యతలను అదనపు హోదాలో చూస్తున్న సునీల్ శర్మను ఈ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది. వరంగల్ జిల్లా కలెక్టర్ శివలింగయ్యను సాధారణ పరిపాలన శాఖలో రిపోర్టు చేయాల్సిందిగా ఆదేశించింది.