TS elections: కుదిరితే ఎమ్మెల్సీ, వీలైతే ఎంపీ టికెట్‌.. ప్రధాన పార్టీల్లో క్షణ క్షణం ఉత్కంఠ

Byline :  Bharath
Update: 2023-11-05 04:14 GMT

తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలు ప్రధాన పార్టీలకు తలనొప్పిగా మారాయి. టికెట్ ఇస్తే ఒక బాధ, ఇవ్వకపోతే ఇంకో బాధలా ఉంది పరిస్థితి. టికెట్‌ ఆశించి భంగపడ్డ నేతలను అధిష్ఠానాలు ఇంకా బుజ్జగిస్తూనే ఉన్నాయి. అసంతృప్తులను సముదాయించేందుకు పార్టీల పెద్దలు ముమ్మరంగా చర్చలు జరుపుతూనే ఉన్నారు. తిరుగుబాటు అభ్యర్థులుగా బరిలోకి దిగకుండా అన్ని రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారు. అసంతృప్త నేతలను పిలిపించి వ్యక్తిగతంగాను లేదా ఫోన్‌చేసి మాట్లాడి నచ్చజెప్తున్నారు. టికెట్ రానివారికి కుదిరితే ఎంపీ, కుదరకపోతే ఎమ్మెల్సీ సీటు ఇప్పించే ప్రయత్నంలో ఉన్నారు. ఎట్టిపరిస్థితిలోనూ ఈ టైంలో నాయకులను వదులుకోవడానికి ఏ పార్టీ సిద్ధంగా కనిపించడం లేదు. అందుకే టికెట్ కేటాయింపు విషయంలో ఇంకా ఆలస్యం చేస్తున్నాయి. టికెట్ రాలేదని బాధపడొద్దని, పార్టీని బలోపేతం చేసి గెలిపిస్తే.. అధికారంలోకి వచ్చాక పదవి ఇచ్చే బాధ్యత తమదని అధిష్టానాలు హామీలు ఇస్తున్నాయి.

అధిష్టానం ముందు సరే అన్నా.. తమ అనుచరులు, అభిమానులతో మాత్రం అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు నాయకులు. దాంతో ఎవరు ఎప్పుడు పార్టీని వీడి వెళ్లిపోతారా అని ప్రధాన పార్టీల్లో గుబులు మొదలయింది. ఇదిలా ఉండగా.. ఎలక్షన్స్ టైం దగ్గరపడుతుంది. నామినేషన్స్ వేయడానికి ఇంకా ఐదు రోజుల గడువు మాత్రమే ఉంది. అయినా చాలా నియోజవకవర్గాల్లో అభ్యర్థులను ప్రకటించకపోవడం.. టికెట్ ఆశిస్తున్న వారు ఆందోళనకు గురవుతున్నారు. బీఫాం చేతికిచ్చేంత వరకు ఏ క్షణం ఏం జరుగుతుందోనని బిక్కుబిక్కుమంటున్నారు. టైం దగ్గర పడుతున్నా మూడు ప్రధాన పార్టీలు.. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు మాత్రం ఇంకా 119 నియోజకవర్గాల్లో పోటీ చేసే అభ్యర్థుల లిస్ట్ ను ప్రకటించలేదు. లేట్ అవుతున్న కొద్దీ ఆశావహుల్లో గుండెల్లో రైళ్లు పరుగిడుతున్నాయి. పార్టీలో ఉండాలో వేరే పార్టీలో చేరాలా అనే సందిగ్ధంలో ఉన్నారు.

Tags:    

Similar News