Nallamala Forest : నల్లమల్ల అడవిలో భారీ అగ్ని ప్రమాదం

Byline :  Veerendra Prasad
Update: 2024-02-18 08:10 GMT

నాగర్ కర్నూల్ జిల్లాలోని నల్లమల్ల అడవి(Nallamala forests)లో మరోసారి భారీ అగ్ని ప్రమాదం(Massive fire) సంభవించింది. పెద్ద ఎత్తున మంటలు ఎగిసిపడుతున్నాయి. మల్లెలతీర్థం తాటిగుండాలలో అడవి తగలబడుతోంది. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న పోలీసులు, అగ్ని మాపక సిబ్బంది హుటాహుటిన ఘటన స్థలానికి చేరుకున్నారు. అగ్ని మాపక సిబ్బంది ఫైరింజన్ల సహయంతో మంటలను అదుపులోకి తీసుకొచ్చేందుకు తీవ్రంగా శ్రమిస్తున్నారు. మంటలను ఆర్పే క్రమంలో ఓ ఫైర్ వాచర్‌కు గాయాలు అయ్యాయి. వెంటనే అధికారులు ఆసుపత్రికి తరలించారు. నల్లమల అడవిలో మంటలు ఎగసిపడుతుండటంతో సమీప ప్రాంత ప్రజలు తీవ్ర భయాందోళనలకు గురి అవుతున్నారు. అగ్ని ప్రమాదం చోటు చేసుకోవడానికి గల కారణం ఏంటి అన్నది తెలియాల్సి ఉంది.

కాగా కొద్ది రోజుల క్రితమే ఈ నెల 1 ననల్లమల అడవిలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. నాగర్‌కర్నూల్‌ జిల్లా ఆమ్రాబాద్‌ మండలం దోమలపెంట, కొల్లంపెంట, కొమ్మనపెంట, పల్లెబైలు, నక్కర్లపెంట ప్రాంతాల్లో 50 హెక్టార్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతం దగ్ధమైంది. మంటలార్పేందుకు అటవీ శాఖ సిబ్బంది తీవ్రంగా కష్టపడ్డారు. తాజాగా 20 రోజుల్లోపే మరో అగ్ని ప్రమాదం చోటుచేసుకోవడం అక్కడి ప్రజలు, పర్యావరణ ప్రేమికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేసవి ఇంకా రాకముందే ఈ ఏడాది వరుసగా అగ్ని ప్రమాదాలు చోటుచేసుకోవడం నల్లమల్ల ప్రాంత ప్రజలను బెంబేలెత్తిస్తోంది.   




Tags:    

Similar News