TSRTC: రెగ్యులర్ బస్ సర్వీసులను తగ్గించిన టీఎస్ఆర్టీసీ.. సజ్జనార్ ట్వీట్
మేడారం సమక్క సారలమ్మ జాతరకు తెలంగాణ ఆర్టీసీ 6 వేల ప్రత్యేకబస్సులు కేటాయించడంతో... హైదరాబాద్ మహానగరంతో పాటు మరికొన్ని చోట్ల రోజువారీ రెగ్యులర్ బస్సు సర్వీసులు తగ్గించారు. దీంతో ఉదయాన్నే కాలేజీలు, ఆఫీసులకు వెళ్లే విద్యార్థులు, ఉద్యోగులు కాస్త ఇబ్బందిపడ్డారు. రేపటి నుంచి ఈ నెల 24 వరకు జాతర జరగనుంది. ఈ నాలుగు రోజుల పాటు మేడారానికి కేవలం హైదరాబాద్ నుంచి మాత్రమే కాకుండా పలు ప్రాంతాల నుంచి నిరంతరాయంగా బస్సు సర్వీసులు కొనసాగనున్నాయి. ఈ సందర్భంగా టీఎస్ ఆర్టీసీ ఎండీ సజ్జనార్ ట్విట్టర్ వేదికగా సాధారణ ప్రయాణీకులకు కీలక రిక్వెస్ట్ చేశారు.
సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి!!
— VC Sajjanar - MD TSRTC (@tsrtcmdoffice) February 20, 2024
తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ…
'తెలంగాణ కుంభమేళాగా ప్రాచుర్యం పొందిన మేడారం శ్రీ సమ్మక్క సారలమ్మ మహా జాతరకు తరలివచ్చే భక్తజన సౌకర్యార్థం 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడుపుతోంది. రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి బస్సులు ఇప్పటికే మేడారానికి వెళ్లాయి. ముఖ్యంగా భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ఉమ్మడి వరంగల్, ఖమ్మం, కరీంనగర్, ఆదిలాబాద్ జిల్లాల్లో 51 క్యాంపులను ఏర్పాటు చేసి.. అక్కడి నుంచి ఈ ప్రత్యేక బస్సులను మేడారానికి నడుపుతున్నాం.
రెండేళ్లకో సారి జరిగే ఈ మహాజాతరలో భక్తుల రద్దీకి అనుగుణంగానే ఈ 6 వేల ప్రత్యేక బస్సులను #TSRTC నడపుతోంది. జాతరకు మహాలక్ష్మి పథకం అమలు నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ గారి ఆదేశాల మేరకు భక్తులకు అసౌకర్యం కలగకుండా యాజమాన్యం అన్ని చర్యలు తీసుకుంటోంది. భక్తులను క్షేమంగా గమ్యస్థానాలకు చేర్చేందుకు ఇంత పెద్దమొత్తంలో బస్సులను మేడారం జాతరకు తిప్పుతున్నదున.. రెగ్యూలర్ సర్వీసులను తగ్గించడం జరిగింది. దీంతో సాధారణ ప్రయాణికులకు కొంత అసౌకర్యం కలిగే అవకాశం ఉంది. కావున జాతర సమయంలో భక్తులకు, ఆర్టీసీ సిబ్బందికి పెద్ద మనసుతో సహకరించాలని సాధారణ ప్రయాణికులకు విజ్ఞప్తి చేస్తున్నాను. జాతర పూర్తయ్యేవరకు తగు ఏర్పాట్లు చేసుకోవాలని వారిని కోరుతున్నాను. తెలంగాణకే తలమానికమైన ఈ జాతరను విజయవంతం చేయడానికి ప్రజలందరూ సహకరించాలని విజ్ఞప్తి చేస్తున్నాను' అని సజ్జనార్ ట్వీట్ చేశారు.