తెలంగాణ కుంభమేళా మేడారం మహాజాతర.. అంగరంగ వైభవంగా ముగిసింది. దాదాపు కోటిన్నర మంది భక్తులు వనదేవతలను దర్శించుకున్నారు. జాతర సమయంలో భక్తులు అమ్మవార్లకు సమర్పించిన కానుకలను (హుండీలను) గురువారం (ఫిబ్రవరి 29) నుంచి లెక్కిస్తున్నారు. మహాజాతర నేపథ్యంలో సమ్మక్క, సారలమ్మ జాతరలో మొత్తం 535 హుండీలను ఏర్పాటు చేశారు. వాటిని హనుమకొండలో ఉన్న టీటీడీ కల్యాణ మండపానికి తీసుకొచ్చి లెక్కిస్తున్నారు. లెక్కింపు జరిగే ప్రదేశంలో చుట్టూరా సీసీ కెమెరాలతో పాటు, 24 గంటలూ పోలీసు బందోబస్తును ఏర్పాటు చేశారు. కాగా ఒడి బియ్యం, కరెన్సీ, నాణేలు, బంగారం, వెండిని వేర్వేరుగా లెక్కించనున్నారు. లెక్కింపు పూర్తయ్యేసరికి దాదాపు 10 రోజుల సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.
కాగా తొలిరోజు హుండీ కౌంటింగ్ పూర్తయ్యే సరికి అధికారులు ఆదాయాన్ని ప్రకటించారు. తొలిరోజు రూ.3.15 కోట్లుగా ఉందని తెలిపారు. మొత్తం 518 హుండీలను ఏర్పాటుచేయగా.. మొదటి రోజు 134 హుండీలను దేవాదాయ శాఖ అధికారులు లెక్కించారు. అందులో మూడు కోట్ల రూపాయలకు పైగా ఆదాయం సమకూరినట్లు ప్రకటించారు. ఈ మొత్తాన్ని అధికారులు మేడారం దేవల పేరు మీదున్న బ్యాంక్ అకౌంట్ లో జమ చేస్తారు.