Medaram Jatara: ప్రభుత్వ కార్యాలయాలన్నీ బంద్.. వరుసగా 5 రోజులు సెలవులు

Byline :  Veerendra Prasad
Update: 2024-02-21 04:00 GMT

ములుగు జిల్లాలోని మేడారం మహా జాతర (Medaram) ప్రారంభమైంది. నాలుగు రోజుల పాటు జరుగనున్న ఈ మహాజాతరకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. ఈ క్రమంలో జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలు, కార్యాలయాలకు ప్రభుత్వం సెలవులు ప్రకటించింది. నాలుగు రోజులు పాటు సెలవులను ప్రకటిస్తూ కలెక్టర్ ములుగు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు ఉత్తర్వులు జారీ చేశారు. 21, 22, 23, 24 తేదీలలో ప్రభుత్వ కార్యాలయాలు పనిచేయవని తెలిపారు. ఈ నాలుగు రోజులు విద్యాసంస్థలను మూసి వేయాలని కలెక్టర్ త్రిపాఠి ఆదేశాలు జారీ చేశారు. బుధవారం నుంచి శనివారం వరకూ ప్రభుత్వం సెలవులివ్వగా.. ఆ తర్వాతి రోజు ఆదివారం కాబట్టి.. ఆ రోజు కూడా స్కూళ్లు, ఆఫీసులకు సెలవు ఉండనుంది. ఈ క్రమంలో జిల్లాలో పనిచేసే ప్రభుత్వ, ప్రైవేట్ ఉద్యోగులకు వరుసగా 5 రోజులు సెలవులు వచ్చాయి.

ప్రతి రెండేండ్లకోసారి జరిగే ఈ గిరిజన పండుగకు సుమారు రెండు కోట్ల మంది తరలి రానున్నారు. ఇప్పటికే ములుగు జిల్లాలోని ఎంతోమంది ప్రజలు వనదేవతలను దర్శించుకుని మొక్కులు చెల్లించుకుంటున్నారు. ఈ మహా జాతరకు తెలంగాణ, ఏపీ నుంచే కాకుండా పొరుగు రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటక, ఛత్తీస్‌ఘడ్, మధ్యప్రదేశ్, జార్ఖండ్ సహా మరికొన్ని రాష్ట్రాల నుంచి భక్తులు వస్తారు. దాదాపు 2 కోట్ల మంది భక్తులు గద్దెలను దర్శించుకుంటారని అంచనా. ఈ మేరకు అధికారులు భారీ ఏర్పాట్లు చేశారు. 2014లో అప్పటి తెలంగాణ ప్రభుత్వం మేడారం జాతరను రాష్ట్ర పండుగగా గుర్తించింది. ఈ మహా జాతరకు రాష్ట్రపతి ద్రౌపదీ ముర్ము రానున్నారు. ఫిబ్రవరి 23న రాష్ట్రపతి గద్దెలను దర్శించుకుంటారు. గవర్నర్‌ తమిళిసై సాందర రాజన్, సీఎం రేవంత్‌రెడ్డి కూడా అదే రోజు మేడారానికి వెళ్లనున్నారు.

Tags:    

Similar News