రేవంత్ సర్కార్ మరో నిర్ణయం.. ఒకే భవనంలో రెండు సమావేశ మందిరాలు

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 01:37 GMT

వచ్చే బడ్జెట్ సమావేశాల నుంచి రాష్ట్ర శాసనసభ, శాసన మండలి సమావేశ మందిరాలు ఒకే భవనంలో కొనసాగనున్నాయి. వచ్చే బడ్జెట్‌ సమావేశాల్లోపు మండలిని పాత అసెంబ్లీ హాలులోకి మార్చాలని, అందుకు ఏర్పాట్లు చేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఆర్అండ్ బీ అధికారులను ఆదేశించారు. తెలంగాణ శాసన సభ ప్రాంగణంలోని కమిటీ హాల్‌లో బుధవారం శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డితో కలిసి ఆర్ అండ్ బీ శాఖ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పార్లమెంట్ మాదిరిగానే అసెంబ్లీ, శాసన మండలి రెండు కూడా ఒకే చోట ఉండాలని ప్రభుత్వం ఆలోచన చేస్తుందన్నారు. రెండు ఒకేచోట ఉంటే శాసన మండలి, శాసన సభ్యులకు, మంత్రులకు, అధికారులకు అందరికి ఉపయోగకరంగా ఉంటుందన్నారు.

చర్చలు సజావుగా సాగి చట్టాలు రూపొందించడం జరుగుతుందని తెలిపారు. వచ్చే బడ్జెట్ సమావేశాలలోపు అన్ని పనులు పూర్తి చేసుకొని ఇక్కడే బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని సీఎం ఆదేశించారని, దానికి అనుగుణంగా అధికారులు ఏర్పాట్లు చేయాలన్నారు. పనులను వేగవంతంగా చేయాలని సూచించారు. ఈ సమావేశంలో శాసన సభ వ్యవహారాల శాఖ మంత్రి శ్రీధర్ బాబు, మండలి డిప్యూటీ చైర్మన్ బండ ప్రకాశ్, తెలంగాణ లేజిస్లేచర్ సెక్రటరీ డాక్టర్ నరసింహా చార్యులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు.

ఈ విషయంపై గతంలోనే సీఎం రేవంత్ రెడ్డి.. శాసనసభ,శాసన మండలి ఓకే దగ్గర నిర్మాణం ఉంటుందని చెప్పారు. శాసనసభ, శాసన మండలి మినహా మరే ఇతర బిల్డింగ్స్ అసెంబ్లీ ప్రాంగణం లోపల ఉండవని రేవంత్ తేల్చి చెప్పారు. రైల్వే గేట్‌కు అనుకుని ఉన్న ప్రహారీ గోడ ఎత్తు పెంచాలన్నారు. మెంబర్స్ ఉదయం పూట వాకింగ్ చేసుకునే విధంగా ఏర్పాట్లు చేయాలని సూచించారు.

Tags:    

Similar News