Rain alert: తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. వర్షాలు తగ్గు ముఖం పట్టినట్లే.. కానీ
గత వారం రోజులుగా ఎడతెరపి లేకుండా కురుస్తున్న వర్షాలతో తెలంగాణ అతలాకుతలం అవుతోంది. వరదల వల్ల జనజీవనం స్తంభించిపోయింది. అంతా అల్లకల్లోలంగా మారింది. ఎక్కడికి వెళ్లు పరిస్థితి లేకపోయింది. నదులు, కాలువలు, వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. భారీగా వరద నీరు ఇళ్లలోకి చేరి ప్రజలు తీవ్ర అవస్తలకు గురవుతున్నారు. ఇప్పటికే అధికారులు అప్రమత్తమై ప్రజలను సురక్షిత ప్రాంతాలను తరలిస్తున్నారు. కాగా, వర్షాలపై వాతావరణ శాఖ ప్రజలకు శుభవార్త చెప్పింది.
బంగాళాఖాతంలో కొనసాగుతున్న తీవ్ర అల్పపీడనం ఇవాళ (జులై 27) ఉదయం బలహీన పడిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. దాంతో రానున్న రోజుల్లో వర్షాలు తగ్గుముఖం పట్టొచ్చని తెలిపింది. అయితే, మరో అల్పపీడనం ఏర్పడితే తప్ప ఇకపై భారీ వర్షాలు కురిసే అవకాశం లేదని వివరించింది. అయితే, ఆగస్టు రెండో వారం లేదా సెప్టెంబర్ లో మళ్లీ భారీ వర్షాలు కురుస్తాయని వెల్లిడించారు. కాగా, గురు, శుక్రవారాల్లో పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని హెచ్చరించింది. కాగా, రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తెలంగాణ చరిత్రలోనే అతిపెద్ద వర్షాలుగా చెప్తున్నారు.