తీవ్రమైన ఎండ, వడ గాలులతో సతమతం అవుతున్న రాష్ట్ర ప్రజలకు హైదరాబాద్ వాతావరణ శాఖ చల్లటి కబురు చెప్పింది. రాబోయే నాలుగు రోజులు రాష్ట్రంలో అక్కడక్కడ తేలిక నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. సోమవారం నుంచి రాష్ట్రంలో పలు చోట్ల ఉరుములు, మెరుపులు, ఈదురు గాలులతో కూడిన భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయితే, ఇప్పటికే పలు చోట్ల వాతావరణం చల్లగా మారి వర్షం కురుస్తోంది.
ఆదిలాబాద్, కుమ్రం భీం ఆసిఫాబాద్, మంచిర్యాల, నిర్మల్, నిజామాబాద్, యాదాద్రి భువగిరి, మేడ్చల్ మల్కాజ్‌గిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మహబూబ్‌నగర్, నాగర్ కర్నూల్, వికారాబాద్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో అత్యధిక వర్షం పడే అవకాశం ఉంది. దాంతో ఆ ప్రాంతాల్లోని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ఇక రాబోయే 7 రోజులు రాష్ట్రమంతటా గరిష్ఠంగా 42 డిగ్రీల నుంచి 44 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతాయని వాతావరణ శాఖ తెలిపింది.