Hyderabad metro:అర్ధరాత్రి వరకు హైదరాబాద్ మెట్రో.. అంతేకాకుండా..?
దేశంలో వినాయక నవరాత్రులు ఘనంగా జరిగే ముఖ్య నగరాల్లో ఒకటి హైదరాబాద్. ఈ వేడుకల్లో సిటీలోని గల్లీలన్నీ వినాయక మండపాలతో నిండిపోతాయి. ప్రస్తుతం నవరాత్రుల కోసం నగరం సిద్ధం అవుతోంది. ప్రత్యేక ఆకర్షనగా నిలిచే ఖైరతాబాద్ వినాయకుడిని చూసేందుకు దేశ నలు మూలల నుంచి తరలి వస్తారు. ఈ క్రమంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని హైదరాబాద్ మెట్రో కీలక నిర్ణయం తీసుకుంది. నవరాత్రుల సందర్భంగా అర్ధరాత్రి వరకు మెట్రో రైళ్లను నడిపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది.
ఈ సందర్భంగా మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి మాట్లాడుతూ.. గతంలో మాదిరిగానే ఈ సౌకర్యాన్ని అందిస్తున్నట్లు తెలిపారు. ఖైరతాబాద్ వినాయకుడిని దర్శించే భక్తులను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంటున్నట్లు చెప్పారు. అంతేకాకుండా ఖైరతాబాద్ స్టేషన్ లో అదనపు టికెట్ కౌంటర్లు ఓపెన్ చేస్తున్నట్లు తెలిపారు. ప్యాసింజర్లు వీలైనంత త్వరగా టికెట్ పొందేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భద్రతను దృష్టిలో పెట్టుకుని మెట్రో స్టేషన్స్ లో అదనపు సిబ్బందిని ఏర్పాటు చేస్తామని అన్నారు.