అసెంబ్లీ ప్రొటెం స్పీకర్‌గా అక్బరుద్దీన్‌ ఒవైసీ

Byline :  Kiran
Update: 2023-12-08 09:00 GMT

తెలంగాణ శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్‌ ఒవైసీ వ్యవహరించనున్నారు. శనివారం ఉదయం 8.30 గంటలకు రాజ్ భవన్ లో గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ అక్బరుద్దీన్‌తో ప్రొటెం స్పీకర్‌గా ప్రమాణం చేయించనున్నారు. అనంతరం ఆయన శాసనసభలో ఎమ్మెల్యేలతో ఆయన ప్రమాణ స్వీకారం చేయిస్తారు. ఆరుసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యే కావడంతో అక్బరుద్దీన్‌కు ఈ అవకాశం దక్కింది.

కొత్త ప్రభుత్వం కొలువుదీరిన నేపథ్యంలో శాసనసభ ప్రొటెం స్పీకర్‌గా ఎవరు వ్యవహరిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. కొత్తగా ఎన్నికైన సభ్యులతో ప్రమాణ స్వీకారం చేయించి స్పీకర్‌ను ఎన్నుకునే వరకు ప్రొటెం స్పీకర్‌ బాధ్యతలు నిర్వహించాల్సి ఉంటుంది. సాధారణంగా ఎక్కువసార్లు శాసనసభకు ఎన్నికైన ఎమ్మెల్యేను ప్రొటెం స్పీకర్‌గా నియమించడం ఆనవాయితీ.

ప్రస్తుతం శాసనసభలో అత్యధికంగా ఎన్నికైన శాసన సభ్యుడిగా మాజీ సీఎం కేసీఆర్‌ ఉన్నారు. ఆయన ఎనిమిది సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలో మాజీ స్పీకర్‌ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, దానం నాగేందర్‌, తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ ఆరుసార్ల చొప్పున శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. కాంగ్రెస్‌లో ఆరుసార్లు ఎన్నికైన ఎమ్మెల్యేలు ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి, తుమ్మల నాగేశ్వర్‌రావు ఉన్నారు. ఈ క్రమంలోనే ఆరుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన ఎంఐఎం నేత అక్బరుద్దీన్కు అవకాశమిచ్చారు. 

Tags:    

Similar News