మా ప్రయాణం బీఆర్ఎస్తోనే.. కేసీఆర్పై అక్బరుద్దీన్ ప్రశంసలు..
కేసీఆర్ ప్రభుత్వంపై ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ప్రశంసలు కురిపించారు. తొమ్మిదేళ్లలోనే రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించిందని తెలిపారు. శాసనసభలో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు-స్వరాష్ట్రంలో సాధించిన ప్రగతిపై ఆయన మాట్లాడారు. కేసీఆర్ మళ్లీ సీఎం అవ్వడం ఖాయమని.. తమ ప్రయాణం బీఆర్ఎస్ తోనే అని స్పష్టం చేశారు. తెలంగాణలో సీఎం కేసీఆర్ చేస్తున్న అభివృద్ధిని అన్ని రాష్ట్రాలు చూసి నేర్చుకోవాలన్నారు.
రాష్ట్ర సీఎం కేసీఆర్ ఉండడం గర్వంగా భావిస్తున్నామని అక్బరుద్దీన్ స్పష్టం చేశారు. జైపూర్ రైలు ఘటనలో చనిపోయిన హైదరాబాద్ యువకుడికి ప్రభుత్వం అండగా నిలిచిందన్నారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్కు ఆయన ధన్యవాదాలు తెలిపారు. రాష్ట్రంలో ఎలాంటి ఘర్షణలకు తావులేదని.. ప్రజలు ప్రశాంతంగా జీవిస్తున్నారని చెప్పారు. 24గంటల కరెంట్, ఇంటింటికి నీరు, షాదీముబారక్ వంటి ఎన్నో పథకాలు ప్రజలకు ఆసరాగా నిలుస్తున్నాయని అన్నారు.
అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం కృషి చేస్తుందని అక్బరుద్దీన్ అన్నారు. రాష్ట్రంలో 50 లక్షల మంది ముస్లీంలు ఉన్నారని.. వారి సంక్షేమానికి ప్రభుత్వం 2200 కోట్లు కేటాయించడం సంతోషమని అక్బరుద్దీన్ చెప్పారు. . మైనార్టీలకు షాదీముబారక్, ఓవర్సీస్ స్కాలర్‌షిప్ వంటి పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ఇక రెండో హజ్ హౌస్‌కు ప్రభుత్వం రూ.23 కోట్లు కేటాయించిందని వివరించారు.