కర్నాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య, డిప్యూటీ సీఎం డీకే శివకుమార్పై మంత్రి హరీశ్ రావు ఫైర్ అయ్యారు. కర్నాటకలో జనం సమస్యలతో ఆత్మహత్యలుచేసుకుంటుంటే అక్కడి నేతలు మాత్రం తెలంగాణలో ఓట్లు అడుగుతున్నారని విమర్శించారు. అసలు ఏం ముఖం పెట్టుకొని ప్రచారం నిర్వహిస్తున్నారని మండిపడ్డారు. అసలు కాంగ్రెస్ నాయకులకు ఏం చూసి ఓట్లు వేయాలని ప్రశ్నించారు. కర్నాటకలో 5గంటల కరెంటు ఇస్తున్నామని డీకే శివకుమార్ స్వయంగా ఒప్పుకున్నారని, అలాంటి వ్యక్తి ఇక్కడకు వచ్చి నీతులు చెబుతారా అని నిలదీశారు.
కాంగ్రెస్ గెలిస్తే కంట్రోల్ అంతా ఢిల్లీలో, కర్నాటకలో ఉంటుందని హరీశ్ రావు అన్నారు. ఆ పార్టీ నాయకులు టికెట్లు కావాలంటే ఢిల్లీకి, డబ్బులు కావాలంటే కర్నాటకు వెళ్తారని, ప్రచారం కోసం ఇతర రాష్ట్రాల నాయకులను తీసుకొస్తారని సటైర్ వేశారు. కృష్ణా జలాలు, ఐటీ వివాదాలు వస్తే కర్నాటక ప్రభుత్వాన్ని ధిక్కరించి తెలంగాణ హక్కులను ఈ కాంగ్రెస్ పార్టీ కాపాడగలదా అని హరీశ్ రావు ప్రశ్నించారు. బ్రిజేష్ ట్రైబ్యునల్ పంచాయతీలో రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు ఎటు వైపు ఉంటారో చెప్పాలని డిమాండ్ చేశారు.