Kotha Prabhakar Reddy Health Condition: కోడికత్తి అంటూ హేళనగా మాట్లాడడం దారుణం: హరీష్ రావు
ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి దాడిపై విపక్ష నేతలు కోడికత్తి అంటూ హేళనగా మాట్లాడడం దారుణమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఘటనపై పోలీసులు ముమ్మరంగా దర్యాప్తు చేస్తున్నారని.. రెండు రోజుల్లో విచారణ పూర్తి చేసి వివరాలు వెల్లడిస్తారన్నారు. నిందితుడి కాల్ డేటాపై కూడా పోలీసులు దృష్టి సారించారని చెప్పారు. దాడికి బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సికింద్రాబాద్ యశోదా ఆస్పత్రిలో కొత్త ప్రభాకర్ రెడ్డిని ఆయన పరామార్శించారు.
ఎంపీ ఆరోగ్యం కొద్దిగా కుదుట పడిందని హరీష్ రావు చెప్పారు. వైద్యులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారని.. చిన్న పేగుకు 4చోట్ల గాయం కావడంతో తొలగించారని వివరించారు. తెలంగాణ రాజకీయాల్లో దాడులకు తావులేదని వ్యాఖ్యానించారు. ప్రజలను రెచ్చగొట్టి అల్లర్లు చేయాలని ప్రతిపక్షాలు కుట్ర చేస్తున్నాయని ఆరోపించారు. ఎన్నికల కమిషన్ ప్రజాప్రతినిధుల భద్రతపై సమీక్షించి భద్రతను పెంచాలని కోరారు.