రేపోమాపో రేవంత్ రెడ్డి జైలుకు వెళ్తాడు : హరీష్ రావు

By :  Krishna
Update: 2023-10-04 08:16 GMT

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రేపోమాపో జైలుకు వెళ్లడం ఖాయమని మంత్రి హరీష్ రావు అన్నారు. ఓటుకు నోటు కేసులో రేవంత్ రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారని ఆరోపించారు. అయితే ఈ కేసులో తనపై విచారణ నిలిపివేయాలని ఆయన హైకోర్టు, సుప్రీం కోర్టుకు వెళ్లారని.. కానీ కోర్టులు మాత్రం విచారణ ఎదుర్కోవాలని తేల్చిచెప్పాయని అన్నారు. రేవంత్ తప్పు చేసిండు కాబట్టే విచారణ ఎదుర్కోవాలని సుప్రీం చెప్పిందన్నారు. న్యాయం ఎప్పటికైనా గెలుస్తుందని.. ఇప్పుడు కాకపోయినా భవిష్యత్లోనైనా ఆయన జైలుకెళ్లడం ఖాయమని హరీష్ రావు అన్నారు.

కొడంగ‌ల్ నియోజ‌క‌వ‌ర్గంలో కోస్గిలో 50పడకల ఆస్పత్రికి హరీష్ రావు ప్రారంభించారు. గతంలో రేవంత్ రెడ్డి నియోజకవర్గానికి స‌ర్కార్ ద‌వాఖానాలను తేల‌క‌పోయాడని విమర్శించారు. బీఆర్ఎస్ నుంచి పోటీ చేసిన న‌రేంద‌ర్ రెడ్డిని గెలిపించారు కాబట్టే నియోజకవర్గానికి మూడు ఆస్ప‌త్రుల‌ను సీఎం కేసీఆర్ మంజూరు చేశారన్నారు. ఇక వైద్యం కోసం నారాయ‌ణ‌పేట‌, మ‌హ‌బూబ్‌న‌గ‌ర్, తాండూరు పోవాల్సిన అవ‌స‌రం లేదని చెప్పారు. కాంగ్రెస్ ప్ర‌భుత్వంలో నేను రాను బిడ్డో స‌ర్కార్ ద‌వాఖానాకు అనేటోళ్లు.. ఇప్పుడు కేసీఆర్ నాయ‌క‌త్వంలో పోదాం ప‌దా బిడ్డ స‌ర్కార్ ద‌వాఖానాకు అనేలా పరిస్థితి మారిందన్నారు.

కోస్గి, కొడంగ‌ల్‌లో ఒక‌ప్పుడు మంచి నీటి క‌ష్టాలుండేవి.. కానీ కేసీఆర్ పాలనలో ఇంటింటికి తాగు నీరు అందిస్తున్నామని హరీష్ రావు చెప్పారు. సీఎం కేసీఆర్ ఇటీవ‌లే పాల‌మూరు ఎత్తిపోత‌ల ప‌థ‌కాన్ని ప్రారంభించారని.. ఏడాదిలోపే మీ పొలాల్లోకి కృష్ణా జ‌లాలు వ‌స్తాయని తెలిపారు. ఆ నీళ్ల‌తో మీ కాళ్లు క‌డిగి రుణం తీర్చుకుంటామన్నారు. మాట‌లు మాట్లాడేది రేవంత్ రెడ్డి అయితే.. చేత‌ల్లో చూపించేది ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డి అని హరీష్ అన్నారు. కొడంగ‌ల్ అభివృద్ధి ముందుకు సాగాలంటే ప‌ట్నం న‌రేంద‌ర్ రెడ్డిని మరోసారి గెలిపించాలని కోరారు.


Tags:    

Similar News