మెడికల్ కాలేజీలపై కమలం పార్టీది జూటా ప్రచారం అని మంత్రి హరీష్ రావు అన్నారు. మెడికల్ కాలేజీలు తామే ఇచ్చినట్లు బీజేపీ నాయకులు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.
ఉమ్మడి రాష్ట్రంలో 20 ఏళ్లకు ఒక్క మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారని.. కానీ ప్రత్యేక రాష్ట్రం వచ్చాక తొమ్మిదేళ్లలోనే 21 మెడికల్ కాలేజీలు ప్రారంభించుకున్నామని చెప్పారు. ఒక్కో మెడికల్ కాలేజీకి తెలంగాణ ప్రభుత్వం రూ.500 కోట్లు ఖర్చు చేస్తున్నదన్నారు. నాడు ఎంబీబీఎస్ సీట్లు 2,950 ఉంటే నేడు 8,340 సీట్లు ఉన్నాయన్నాయని హరీష్ రావు చెప్పారు
గతంలో వైద్యవిద్య కోసం ఉక్రెయిన్, చైనా వెళ్లాల్సిన పరిస్థితి ఉండేదని.. కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదని హరీష్ రావు చెప్పారు. దేశవ్యాప్తంగా మోడీ ప్రభుత్వం 157 మెడికల్ కాలేజీలు ఇస్తే అందులో తెలంగాణకు ఒక్కటి కూడా లేదన్నారు. బీజేపీ పరిస్థితి మందికి పుట్టిన బిడ్డ మాదే అని ముద్దాడినట్టు ఉందని ఎద్దేవా చేశారు. హైదరాబాద్ కూకట్‌పల్లి హౌసింగ్ బోర్డు కాలనీలో 100 పడకల దవాఖాన నిర్మాణానికి మంత్రి శంకుస్థాపన చేశారు. బీజేపీ మంత్రులు ఢిల్లీలో అవార్డులు ఇస్తారని, గల్లీలో తిడుతున్నారని విమర్శించారు. దీనిపైప్రజలు ఒక్కసారి ఆలోచించాలని, పని చేసేవారిని ఆశీర్వదించాలని కోరారు.
వచ్చే నెల 14 నుంచి రాష్ట్ర వ్యాప్తంగా న్యూట్రిషన్ కిట్‌ను అందించబోతున్నామని మంత్రి తెలిపారు. ఎవరూ అడగక ముందే సీఎం కేసీఆర్ ఈ పథకాన్ని అమలు చేస్తున్నారని.. తల్లి బలంగా ఉంటే పుట్టబోయే బిడ్డ కూడా బాగుంటుందని చెప్పారు. ఇది తల్లి, బిడ్డలకు సీఎం కేసీఆర్ అందిస్తున్న కానుక అని అన్నారు. పుట్టుక నుంచి చావుదాకా ప్రజలకు ఏం కావాలో ఆలోచించింది సీఎం కేసీఆర్ మాత్రమేనని స్పష్టం చేశారు. తెలంగాణ రాకముందు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవాలు 30 శాతం ఉంటే, ప్రస్తుతం అవి 70 శాతానికి చేరాయన్నారు. అందరూ కష్టపడి పనిచేస్తేనే ఇది సాధ్యమయిందని చెప్పారు.
హైదరాబాద్ నీటి కష్టాలను సీఎం కేసీఆర్ తీర్చారని హరీష్ రావు అన్నారు. గతంలో తాగునీటి కోసం ప్రజలు ధర్నాలు చేశారు కానీ ఇప్పుడు అలాంటి పరిస్థితులు లేవన్నారు. మహారాష్ట్రలో తొమ్మిది రోజులకు ఒకసారి నీళ్లు వచ్చే ప్రాంతాలు కూడా ఉన్నాయని చెప్పారు. హైదరాబాద్‌లోనే కాదు.. పల్లెల్లో కూడా కేసీఆర్ 24 గంటలు కరెంటు ఇస్తున్నారని తెలిపారు. దీంతో ఇన్వర్టర్లు, కన్వర్టర్లు, జనరేటర్లు కనిపించకుండా పోయాయన్నారు.