Harish Rao: కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఆగమైతరు - హరీష్ రావు

By :  Kiran
Update: 2023-10-28 10:28 GMT

కాంగ్రెస్ పార్టీని నమ్మి ఓటేస్తే ఆగం అవుతారని మంత్రి హరీష్ రావు అన్నారు. మోసం, దగాకు ఆ పార్టీ మారుపేరని విమర్శించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆదిలాబాద్ జిల్లా ఉట్నూర్ లో నిర్వహించిన బీఆర్ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో ఆయన పాల్గొన్నారు. గిరిజన తండాలు, గూడెంలను గ్రామ పంచాయితీలుగా మారుస్తామని కాంగ్రెస్ హామీ ఇస్తేదాన్ని నిజం చేసిన ఘనత కేసీఆర్ ప్రభుత్వానిదని హరీష్ స్పష్టం చేశారు. పోడు భూములకు పట్టాలిచ్చి గిరిజన రైతులను ఆదుకున్నామన్న ఆయన.. రైతు బీమా తరహాలోనే భూమిలేని పేదలకు రూ.5 లక్షల బీమా వర్తింపచేస్తామని స్పష్టం చేశారు.

వ్యవసాయానికి కేవలం 3గంటల కరెంటు సరిపోతుందని కాంగ్రెస్ పార్టీ నాయకులు చేస్తున్న వ్యాఖ్యలను హరీష్ రావు గుర్తు చేశారు. 3గంటల కరెంటు కావాల్సినోళ్లు కాంగ్రెస్ కు, 24 గంటల ఫ్రీ కరెంట్ కావాలనుకునేవారు బీఆర్ఎస్కు ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్‌ హయాంలో ఆదిలాబాద్‌ ఎంతో అభివృద్ధి చెందిందని గుర్తు చేశారు. గత పదేళ్లలో రాష్ట్రంలో కరువు లేదని, కర్ఫ్యూలేదని చెప్పారు.

గత ప్రభుత్వాలు రైతులను ఇబ్బందులకు గురి చేసి డబ్బు వసూలు చేసేవని, కానీ కేసీఆర్ పాలనలో కరెంటు, నీటి బిల్లు చెల్లించాల్సిన అవసరం లేకుండా పోయిందని హరీష్ రావు చెప్పారు

దేశంలో రైతులకు డబ్బులిచ్చిన ఒకే ఒక్క నాయకుడు కేసీఆర్ అని ప్రశంసించారు. బీఆర్ఎస్ మళ్లీ అధికారంలోకి వస్తే రూ. 400కే గ్యాస్‌ సిలిండర్‌ ఇస్తామని హామీ ఇచ్చారు. డిసెంబరు 30న కేసీఆర్‌ మూడోసారి సీఎంగా ప్రమాణ స్వీకారం చేస్తారని హరీష్ రావు ధీమా వ్యక్తం చేశారు.

Tags:    

Similar News