కేసీఆర్ పేరు చెడగొట్టాలన్నదే రేవంత్ ఉద్దేశం : Harish Rao

Byline :  Krishna
Update: 2024-02-17 09:53 GMT

కాంగ్రెస్ ప్రభుత్వం తమపై బురద జల్లేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోందని మాజీ మంత్రి హరీష్ రావు అన్నారు. శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. సీఎం తమని రెచ్చగొట్టాలని చూస్తున్నారని ఆరోపించారు. కేసీఆర్‌ పేరును చెడగొట్టాలన్నదే రేవంత్‌ ఉద్దేశ్యంగా కనిపిస్తోందని మండిపడ్డారు. కాళేశ్వరంలో ఒక బ్యారేజీ పిల్లర్లు కూలిపోతే వెంటనే రిపేర్ చేసి రైతులకు నీళ్లు ఇవ్వాలి కానీ రాజకీయాలు చేయడం కరెక్ట్ కాదని చెప్పారు. కాళేశ్వరంపై తాము ఏ విచారణకు అయినా సిద్ధమని స్పష్టం చేశారు.

సీడబ్ల్యూసీ CWC సూచనల ప్రకారమే ప్రాజెక్టులు నిర్మించామని హరీష్ రావు చెప్పారు. పోలవరంలోనూ డయాఫ్రం వాల్ కూలిపోయిందని కానీ రేవంత్ సర్కార్ మేడిగడ్డనే చూపించి బురద జల్లడం సరికాదని విమర్శించారు.

మహారాష్ట్ర ప్రభుత్వం ప్రాణహిత-చేవెళ్లకు ఒప్పుకోలేదు కాబట్టే కాళేశ్వరం నిర్మించాల్సి వచ్చిందన్నారు. కాంగ్రెస్ నిజాలు తెలుసుకని మాట్లాడాలని చెప్పారు. మిషన్‌ కాకతీయతో వేల చెరువులను పునరుద్ధరించామని హరీష్ రావు తెలిపారు. దీని వల్ల చెరువులు తెగిపోవడంతో పాటు 15 లక్షల ఎకరాలకు ఆయకట్టు పెరిగిందన్నారు.

వైఎస్ హయాంలో చేపట్టిన జలయజ్ఞంలో భాగంగా తెలంగాణలో 35 ప్రాజెక్టులు నిర్మిస్తామని చెప్పి.. ఒక్క ప్రాజెక్టును కూడా పూర్తి చేయలేదని హరీష్ రావు ఆరోపించారు. కానీ గత పదేళ్లలో తాము చిత్తశుద్ధితో ప్రాజెక్టులను పూర్తిచేశామన్నారు. కల్వకుర్తి ప్రాజెక్టు ద్వారా 3లక్షల ఎకరాలు, నెట్టంపాడు ద్వారా లక్షా 39 వేల ఎకరాలకు సాగునీరు అందించినట్లు చెప్పారు. అదేవిధంగా 6250 చెరువులను ప్రాజెక్టులతో అనుసంధానం చేశామని చెప్పారు.

Tags:    

Similar News