Komatireddy Venkat Reddy : అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయినా బుద్ది రాలేదు - కోమటిరెడ్డి

Byline :  Kiran
Update: 2024-02-05 12:54 GMT

(Komatireddy Venkat Reddy) అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమిపాలైనా బీఆర్ఎస్ నేతలకు బుద్ధిరాలేదని మంత్రి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి అన్నారు. కారు సర్వీసింగుకు పోయిందని అంటున్నారని కానీ అది షెడ్డుకుపోయిందని సటైర్ వేశారు. నల్లగొండ జిల్లాను నాశనం చేసినందుకు బీఆర్ఎస్ పార్టీకి ప్రజలు గట్టిగా బుద్ధి చెప్పారని అన్నారు. నల్లగొండ జిల్లాలో బీఆర్ఎస్ కేవలం ఒక్క సీటు మాత్రమే గెలిచిందని, తాము ప్రచారం చేసుంటే 70వేల ఓట్ల తేడాతో ఆయన ఓడిపోయే వారని అన్నారు. నైతికంగా చూస్తే జిల్లాలోని 12 సీట్లను కాంగ్రెస్ గెలిచిందని వెంకట్ రెడ్డి అభిప్రాయపడ్డారు.

యాదాద్రి థర్మల్‌ ప్లాంట్‌ నిర్మాణంలో జగదీశ్ రెడ్డి వేల కోట్లు దోచుకున్నరని కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి ఆరోపించారు. సూర్యాపేట కలెక్టర్ ఆఫీసు నిర్మాణం విషయంలోనూ భారీ అవినీతికి పాల్పడి వందల కోట్లు కొల్లగొట్టాడని మండిపడ్డారు. అవసరం లేకున్నా కమిషన్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టు కట్టారని విమర్శించారు. మూడేండ్లు పూర్తికాక ముందే మేడిగడ్డ కూలిపోయిందంటే అందులో ఎంత అవినీతి జరిగిందో అర్థం చేసుకోవచ్చని వెంకట్ రెడ్డి అన్నారు. సూర్యాపేట ప్రజలు తాగేందుకు నీళ్లు లేక మూసీ నీళ్లు తాగుతున్నారని వెంకట్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కైన కేసీఆర్ తెలంగాణను నాశనం చేశాడని వెంకట్ రెడ్డి మండిపడ్డారు. డిండి ప్రాజెక్టు పనులు పూర్తి చేయకుండా పాలమూరును ఎండబెట్టిన పాపం ఆయనదేనని అన్నారు. పదేళ్లు అధికారంలో ఉండి కాళేశ్వరం తప్ప ఇతర ప్రాజెక్టులను ఎందుకు పట్టించుకోలేదని ప్రశ్నించారు.  




Tags:    

Similar News