జగదీశ్‌రెడ్డి పవర్‌ లేని పవర్ మినిస్టర్‌: మంత్రి కోమటిరెడ్డి

Byline :  Veerendra Prasad
Update: 2023-12-21 08:04 GMT

బీఆర్‌ఎస్‌ హయాంలో విద్యుత్‌ రంగంలో భారీ అవినీతి జరిగిందని మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. విద్యుత్ శాఖలో అవినీతిపై జ్యుడీషియల్ ఎంక్వయిరీకి ఆదేశించినందుకు సీఎం రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు చెబుతూనే.. జగదీష్ రెడ్డి గతంలో పవర్ లేని పవర్ శాఖ మంత్రిగా పనిచేశారన్నారు. ఆయన విద్యుత్ మంత్రి కాదు యాదాద్రి పవర్ ప్లాంట్ లో సబ్ కాంట్రాక్టర్ అని, మాజీ అధికారి ప్రభాకర్‌రావు, మాజీ మంత్రి జైలుకు పోవడం ఖాయమని విచారణలో అన్ని తేలుతాయని అన్నారు.

దీనిపై జగదీశ్ రెడ్డి స్పందిస్తూ.. విద్యుత్ పై విడుదల చేసిన శ్వేత పత్రం తప్పులు తడకగా ఉందన్నారు. న్యాయ విచారణలను మేం స్వాగతిస్తున్నామని, ప్రాజెక్టుల విషయంలో దాచి పెట్టడానికి ఏమీ లేదన్నారు. గతంలో కాంగ్రెస్‌ హయాంలో ఏనాడూ 3 గంటలకు మించి ఇవ్వలేదన్నారు. గత 9 ఏళ్లలో ఒక్క రోజైనా రైతు విద్యుత్‌ కోసం ధర్నా చేశారా? విద్యుత్‌ మూడు గంటలు చాలన్న వాళ్లకు రైతుల సమస్యలు ఏం తెలుస్తాయి అని జగదీశ్‌రెడ్డి మండిపడ్డారు. కోమటిరెడ్డి బ్రదర్స్‌ను ఉద్దేశించి.. కాంట్రాక్టుల కోసం పార్టీలు మారిన చరిత్ర ఆ సోదరులదన్నారు. తనను ఎంత రెచ్చగొట్టినా వ్యక్తిగత విషయాలు మాట్లాడనని, సభలోనే కాదు బయట కూడా వ్యక్తిగత ఆరోపణలు చేయడం తనకు అలవాటు లేదన్నారు. అవసరాల కోసం.. పదవుల కోసం తాను విమర్శలు, ఆరోపణలు చేయబోనని, పార్టీలు మారే క్యారెక్టర్ తనది కాదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం.. గత ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇచ్చినట్లే 24 గంటల కరెంటు ఇస్తారా లేదా సభ సాక్షిగా క్లారిటీ ఇవ్వాలన్నారు. మీటర్లు పెట్టకుండా కరెంటు ఇస్తారా? లేదా? అనేది స్పష్టం చేయాలన్నారు. మేనిఫెస్టోలో చెప్పినట్లు ఉచిత విద్యుత్ ఇస్తారా లేదా? అనే దానిపై సభాముఖంగా ప్రకటన చేయాలని, భవిష్యత్తులో అప్పులు చేయకుండా విద్యుత్ ఇస్తారా లేదా అని కూడా చెప్పాలన్నారు.

Tags:    

Similar News