Komatireddy Venkat Reddy : కాంగ్రెస్‌లోకి 30 మంది ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి కామెంట్స్

Update: 2024-01-23 05:30 GMT

తెలంగాణ రాష్ట్ర రహదారులు, భవనాల శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత 30 మంది బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో చేరుతారని కోమటిరెడ్డి అన్నారు.

నల్గోండ జిల్లా కలెక్టరేట్‌లో నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన అనంతరం మాట్లాడుతూ ఈ కామెంట్స్ చేశారు. తెలంగాణ కోసం తాను మంత్రి పదవిని త్యాగం చేశాని అన్నారు. తన గురించి మాట్లాడే అర్హత బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే జగదీశ్‌రెడ్డి లేదన్నారు దాద్రి, భద్రాద్రి థర్మల్ విద్యుత్‌ కేంద్రాల్లో అక్రమాలతోపాటు చత్తీస్‌గఢ్‌లో కరెంటు కొనుగోళ్లలో అవినీతి బయటపడుతుందన్న అక్కసుతోనే ఆయన తనపై ఆరోపణలు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆరు గ్యారెంటీలను వంద రోజుల్లోపు అమలు చేసి తీరుతామని పునరుద్ఘాటించారు.

మేడిగడ్డ విషయంలో ఎన్ని జిమ్మిక్కులు చేసినా.. విజిలెన్స్ విచారణను, సిట్టింగ్ జడ్జితో విచారణను ఎవరూ అడ్డుకోలేరని అన్నారు.ఒకప్పుడు ప్యారగాన్ స్లిప్పర్లు వేసుకుని తిరిగిన వ్యక్తి జగదీష్ రెడ్డి అని.. అలాంటి వ్యక్తికి ఇప్పుడు రూ.వేల కోట్ల ఆస్తులు, ఫామ్ హౌస్‌లు ఎలా వచ్చాయని ప్రశ్నించారు. బీఆర్ఎస్ పార్టీలో కేసీఆర్ కుటుంబంలో బావా, బామ్మర్దులు తన్నుకుంటుంటే విషయం బయటికి పొక్కకుండా కేసీఆర్ జాగ్రత్తలు తీసుకుంటున్నారని, అందులో జగదీష్ ​రెడ్డి బ్రోకర్‌లాగా వ్యవహరించారని వ్యాఖ్యలు చేశారు. తాను ఎల్లప్పుడూ ప్రజల్లో ఉంటానని.. అలాంటి తనపై జగదీష్ రెడ్డి లాంటి చిల్లర వ్యక్తి ఆరోపణలు చేయడం విచిత్రం అని అన్నారు. తెలంగాణ కోసం మంత్రి పదవులను తాను త్రుణప్రాయంగా విసిరికొట్టానని గుర్తు చేశారు. కానీ జగదీష్ ​రెడ్డి మంత్రి పదవి కోసం కేసీఆర్ ఆడించినట్లు ఆడాడని అన్నారు. నల్గొండ ప్రజలు జగదీష్ రెడ్డిని చూసి నవ్వుకుంటున్నారని అన్నారు.

Tags:    

Similar News