బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్ల ముందు కనిపిస్తోంది - మంత్రి కేటీఆర్
ఉమ్మడి ఏపీలో విద్యుత్, తాగునీటి సమస్యలు తీవ్రంగా ఉండేవని మంత్రి కేటీఆర్ అన్నారు. గతంలో తెలంగాణలో తరచూ విద్యుత్ కోతలు, తాగునీటి కోసం నిరసనలు జరిగేవని గుర్తు చేశారు. హైదరాబాద్‌లో శనివారం హైదరాబాద్‌లో పార్ట్‌నర్స్ ఇన్ ప్రోగ్రెస్ ప్రోగ్రామ్‌లో మాట్లాడిన ఆయన.. బీఆర్ఎస్ హయాంలో హైదరాబాద్ గణనీయంగా అభివృద్ధి చెందిందని అన్నారు. మౌలిక సదుపాయాల విషయంలో ఎంతో పురోగతి సాధించామని చెప్పారు. హైదరాబాద్‌లో కాలుష్య రహిత ప్రజా రవాణా అందించడమే లక్ష్యమని, ఇందులో భాగంగా రానున్న 10 ఏండ్లలో మెట్రోను 415 కి.మీ విస్తరించాలని ఎజెండాగా పెట్టుకున్నామని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.
నగరంలో 24 గంటల తాగునీటిని అందించాలన్నదే తమ స్వప్నమని కేటీఆర్ చెప్పారు. మిషన్ భగీరథ ద్వారా హైదరాబాద్‌లో తాగునీటి సమస్య లేకుండా చేశామని, నిరంతర విద్యుత్ సరఫరా చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ మాత్రమేనని గుర్తు చేశారు. బీఆర్ఎస్ చేసిన అభివృద్ధి కళ్లముందే కనిపిస్తోందని, ప్రజలు పనిచేసే ప్రభుత్వాన్నే ఆశీర్వదిస్తారని చెప్పారు. నగరంలో శాంతిభద్రతలు అద్భుతంగా ఉన్నాయన్న మంత్రి.. హైదరాబాద్ ఎంతో అభివృద్ధి చెందినదని నటుడు రజినీకాంత్ పొగిడిన విషయాన్ని గుర్తుచేశారు. అభివృద్ధిలో హైదరాబాద్ న్యూయార్క్‌తో పోటీ పడుతోందని కేటీఆర్ అన్నారు. గత పదేళ్లలో నగరంలో 36 ఫ్లైఓవర్లు నిర్మించామని, 39 చెరువులను సుందరీకరించామని చెప్పారు.