అసెంబ్లీ ఎన్నికలకు మరో వారం రోజుల సమయం మాత్రమే ఉండటంతో బీఆర్ఎస్ నేతలు ప్రచారంలో దూసుకుపోతున్నారు. వరుస రోడ్ షోలతో ప్రజలతో మమేకమవుతున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా పలు నియోజకవర్గాల్లో పర్యటించిన మంత్రి కేటీఆర్.. కాంగ్రెస్ పార్టీపై ఫైర్ అయ్యారు. 24 గంటల కరెంటు, ధరణి పోర్టల్, రైతు బంధుపై ఆ పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలకు కౌంటర్ ఇచ్చారు.
ఇందిరమ్మ రాజ్యం అంటే ఆకలి కేకలు, గంజి కేంద్రాలు మాత్రమేనని కేటీఆర్ అన్నారు. మక్తల్లో ప్రచారం నిర్వహించిన ఆయన.. 24 గంటల కరెంటు ఇవ్వడం లేదన్న కాంగ్రెస్ నేతలు విద్యుత్ తీగలను పట్టుకుంటే కరెంటు ఉందో లేదో తెలుస్తుందని అన్నారు. కాంగ్రెస్ పాలనలో కరెంట్ పరిస్థితి ఎలా ఉండేదో అందరికీ తెలుసన్న ఆయన.. 24 గంటల కరెంటు, రైతు బంధు కావాలనుకునేవారు బీఆర్ఎస్కు ఓటేయాలని కేటీఆర్ సూచించారు. ధరణిలో ఉన్న చిన్న చిన్న సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు.
అంతకు ముందు దేవరకొండలో రోడ్ షో నిర్వహించిన కేటీఆర్.. వందల కోట్ల నిధులతో సాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తున్నామని అన్నారు. ఢిల్లీ పార్టీ చాలా డేంజర్ అన్న ఆయన.. కాంగ్రెస్ పార్టీకి 11 సార్లు అధికారమిస్తే ఏం చేశారని ప్రశ్నించారు. రాష్ట్రంపై కేసీఆర్‌కు ఉన్నంత కమిట్మెంట్ కాంగ్రెస్ వాళ్లకు ఉండదని చెప్పారు. కేసీఆర్ ను కట్టిడి చేయాలని ఢిల్లీ పెద్దలు కుట్రలు చేస్తున్నారని ఆరోపించారు. ప్రజలు మళ్లీ అధికారం అప్పగిస్తే రేషన్ కార్డు ఉన్నోళ్లందరికీ సన్నబియ్యం ఇస్తామని, అసెన్డ్ భూములపై హక్కులు కల్పిస్తామని కేటీఆర్ హామీ ఇచ్చారు.
సూర్యాపేటలో ఎన్నికల ప్రచారంలో భాగంగా మంత్రి కేటీఆర్ హుజూర్ నగర్ పట్టణంలో బీఆర్ఎస్ అభ్యర్ధి సైదిరెడ్డి తరపున రోడ్డు షోలో పాల్గొన్నారు. హుజూర్ నగర్‌కు ఇచ్చిన ప్రతీ హామీని కేసీఆర్ నెరవేర్చారని చెప్పారు. తండాలు గ్రామపంచాయితీలుగా చేసిన ఘనత కేసీఆర్‌దేనన్న కేటీఆర్.. కరెంట్ కావాలో కాంగ్రెస్ రావాలో మీరే నిర్ణయించుకోండని సూచించారు.