సీఎం ప్ర‌క‌ట‌న విని కాంగ్రెసోళ్ల ఫ్యూజులు ఎగిరిపోయినై : KTR

Update: 2023-08-04 10:57 GMT

ప్రతిపక్ష నేతలు ప్ర‌భుత్వాన్ని బ‌ద్నాం చేయ‌డమే ల‌క్ష్యంగా పెట్టుకున్నారని మంత్రి కేటీఆర్ అన్నారు. కేసీఆర్ రుణ‌మాఫీ ప్ర‌క‌ట‌న చేయ‌గానే కాంగ్రెసోళ్ల ఫ్యూజులు ఎగిరిపోయాయని అందుకే అన‌వ‌స‌ర ఆరోప‌ణ‌లు చేస్తున్నారని మండిపడ్డారు. హేతుబ‌ద్ధంగా, శాస్త్రీయంగా ఆధారాలు చూపించాలే తప్ప బట్టకాల్చి మీద వేసినట్లు మాట్లాడొద్దని హితవు పలికారు. రైతుల‌కు 3 గంట‌ల క‌రెంట్ ఇస్తామ‌ని చెప్పిన వారు నీతులు చెప్ప‌డం స‌రికాదన్న కేటీఆర్... అన్నదాతలు అన్నీ గ‌మ‌నిస్తున్నారని అన్నారు. రెండుసార్లు రుణ‌మాఫీ చేసిన ముఖ్య‌మంత్రి కేసీఆర్.. రైతుబంధు ప్ర‌వేశ‌పెట్టి 73 వేల కోట్లు రైతుల ఖాతాల్లో వేసిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. రైతు బీమా తెలంగాణ‌లో త‌ప్ప మ‌రెక్క‌డా అమ‌లు చేయ‌డం లేదని స్పష్టం చేశారు

అవగాహన లేకుండా మాట్లాడొద్దు

అంతకు ముందు వ‌ర‌ద నష్టంపై మాట్లాడిన కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధ‌ర్ బాబుపై రాష్ట్ర ఐటీ, ప‌రిశ్ర‌మ‌ల శాఖ మంత్రి కేటీఆర్ మండిప‌డ్డారు. వ‌ర‌ద న‌ష్టంపై ఆయన ప్ర‌జ‌ల‌ను త‌ప్పుదోవ ప‌ట్టించేలా మాట్లాడడాన్ని తప్పుబట్టారు. . వ‌ర‌ద న‌ష్టం అంచానాను శ్రీధ‌ర్ బాబు ఎలా చెబుతారన్న ఆయన.. వ‌ర‌ద న‌ష్టంపై గాలి మాట‌లు మాట్లాడొద్దని చెప్పారు. వ‌రి పంట‌లో రెండు రోజులు నీళ్లున్నా న‌ష్టం జ‌ర‌గ‌దు. సోయా, ప‌త్తి పంట‌లో నీళ్లుంటే న‌ష్టం జ‌రుగుతుందన్న కనీస అవగాహన లేకుండా స్వీపింగ్ రిమార్క్స్ చేస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. శాస్త్రీయంగా ఆధారాలుంటేనే మాట్లాడాలే తప్ప దుష్ర్ప‌చారం చేయ‌డం స‌రికాదని హితవు పలికారు.

పార్టీ విధానం చెప్పండి

తెలంగాణ‌లోని రైతాంగానికి 3 గంట‌ల క‌రెంట్ స‌రిపోతుంద‌న్న కాంగ్రెస్ పార్టీ అధ్య‌క్షుడు రేవంత్ రెడ్డి వ్యాఖ్యలను కేటీఆర్ గుర్తు చేశారు. గ‌తంలో 6 గంట‌ల క‌రెంట్ ఇచ్చి రైతుల‌ను చావ‌గొట్టాం.. అవ‌కాశం ఇస్తే మూడు గంట‌ల క‌రెంట్ ఇస్తాం. 24 గంట‌ల క‌రెంట్ ఇచ్చే ప్ర‌స‌క్తే లేద‌ని వారి అధ్య‌క్షుడు నిర్ద్వందంగా కెమెరాల ముందు చెప్పారని మండిపడ్డారు. ప్రభుత్వానికి నీతులు చెప్పే శ్రీధ‌ర్ బాబు ముందు వారి పార్టీ విధానం చెప్పాల‌ని డిమాండ్ చేశారు. ధ‌ర‌ణి ర‌ద్దు చేస్తాం.. ద‌ళారీయ ప్ర‌భుత్వం తెస్తామ‌ని చెప్తాడా? లేక వారి అధ్య‌క్షుడి చెప్పింది త‌ప్పు అని శ్రీధ‌ర్ బాబు రైతాంగానికి క్ష‌మాప‌ణ చెప్తారా..? అని కేటీఆర్ నిల‌దీశారు.


Tags:    

Similar News