కాంగ్రెస్ సీనియర్ నేత జానారెడ్డికి మంత్రి కేటీఆర్ కౌంటర్ ఇచ్చారు. సంస్కారం గురించి కాంగ్రెస్ నేతల దగ్గర నేర్చుకోవాల్సిన కర్మ తమకు లేదని అన్నారు. జానారెడ్డి ముందుగా తమ పీసీసీ ప్రెసిడెంట్ కు సంస్కారం గురించి నేర్పించాలని సూచించారు. బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ, వార్ రూం ఇంఛార్జులతో బేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. కేసీఆర్కు పిండం పెట్టాలన్నప్పుడు, కొట్టి చంపాలన్నప్పుడు జానారెడ్డి సంస్కారం ఎటు పోయిందని కేటీఆర్ ప్రశ్నించారు. రూ.50కోట్లకు పీసీసీ పదవి అమ్ముకున్న పార్టీ కాంగ్రెస్ అని ఫైర్ అయ్యారు. రేవంత్ రెడ్డిపై సొంత పార్టీ నేతలే ఈడీకి ఫిర్యాదు చేస్తున్నారని కేటీఆర్ గుర్తు చేశారు.
ప్రజల ఆశీర్వాదంతో ముచ్చటగా మూడోసారి సీఎం కేసీఆర్ అధికారంలోకి వస్తారని కేటీఆర్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా ప్రజలు బీఆర్ఎస్ కు బ్రహ్మరథం పడతారని అన్నారు. కాంగ్రెస్ పార్టీకి 40 స్థానాల్లో బీజేపీకి 100 సీట్లలో అభ్యర్థులే లేరని కేటీఆర్ చెప్పారు. అధికారం చేపడతామని ఆ రెండు పార్టీలు కలలు కంటున్నాయని, క్షేత్రస్థాయిలో మాత్రం ప్రజలు బీఆర్ఎస్ వెంటే ఉన్నారని స్పష్టం చేశారు.
రాహుల్ గాంధీపై కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి స్పందించారు. కేటీఆర్ కు సంస్కారం లేదని అందుకే రాహుల్ గాంధీ గురించి అలా మాట్లాడారని అన్నారు. సంస్కారం లేని వాళ్ల గురించి తాను మాట్లాడనని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ప్రజలకిచ్చిన హామీలేవీ అమలు చేయలేదని జానా రెడ్డి విమర్శించారు.