KTR : జగనన్నకు చెప్పి జాగా ఇప్పిస్తా.. ఏపీలోనూ.. : కేటీఆర్
వచ్చే పదేళ్లలో హైదరాబాద్, వరంగల్‌కు తేడా ఉండదని మంత్రి కేటీఆర్ అన్నారు. ఐటీ రంగంలో భవిష్యత్ అంతా టైర్ 2 నగరాలదే అని చెప్పారు. హనుమకొండ జిల్లాలోని మడికొండ ఐటీ పార్కులో క్వాడ్రెంట్ ఐటీ కంపెనీని కేటీఆర్ ప్రారంభించారు. సింగపూర్, జపాన్ లాగా మనం కూడా ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలని ఆయన ఆకాంక్షించారు. టాలెంట్ అనేది ఎవరి సొత్తు కాదని.. ఎక్కడ చదివామన్నది ముఖ్యం కాదని.. ఏ స్థాయికి చేరుకున్నామనేదే చూడాలన్నారు.
వరంగల్‌లోనే కాదు ఏపీలోని భీమవరం, నెల్లూరుకు కూడా ఐటీ సంస్థలు రావాలని కేటీఆర్ ఆకాంక్షించారు. ‘‘అక్కడా ఐటీ సంస్థలను పెట్టాలని ఎన్నారైలను కోరుతున్నాను. కావాలంటే జగనన్నకు చెప్పి నేను జాగా ఇప్పిస్తాను. బెంగళూరు ఐటీ రంగంలో 40 శాతం తెలంగాణ, ఏపీ వారే ఉన్నారు. తిరిగి తమ సొంత రాష్ట్రాలకు వచ్చేందుకు వారంతా సిద్ధంగా ఉన్నారు. ఉన్నచోటే యువతకు ఉపాధి దక్కాలి. కులం, మతం పేరుతో కొట్టుకుచావడం మానాలి’’ అని కేటీఆర్ అన్నారు.
25ఏళ్ల క్రితం దేశంలో ఒక డిజిటల్ రెవల్యూషన్ ప్రారంభమైందని కేటీఆర్ గుర్తు చేశారు. మనిషి బుర్రకు ఎంత పదును పెడితే, ఎంత బాగా వాడగలిగితే ఎన్ని అద్భుతాలైనా సృష్టించే అవకాశం ఉందన్నారు. సింగపూర్, జపాన్ దేశాల్లో మానవ వనరులు తప్ప ప్రకృతి వనరులు లేకున్నా ఇవాళ ప్రపంచాన్ని శాసించే శక్తులుగా ఎదిగాయని చెప్పారు. కేవలం బ్రెయిన్ పవర్‌తో మాత్రమే అవి ఆ స్థాయికి చేరుకున్నాయన్నారు. మనం కూడా ప్రపంచాన్ని శాసించే శక్తిగా ఎదగాలని పిలుపునిచ్చారు.