తయారీ రంగంలో జపాన్‌ ప్రపంచానికే ఆదర్శం… కేటీఆర్

Update: 2023-07-14 07:42 GMT

తయారీ రంగంలో జపాన్‌ ప్రపంచానికే ఆదర్శమని, ఆ దేశానికి వెళ్లిన ప్రతిసారీ కొత్త అంశాలను నేర్చుకుంటామని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రంగారెడ్డి జిల్లా చందన్‌వల్లి ఇండస్ట్రియల్‌ పార్కులో జపాన్‌కు చెందిన డైఫుకు(Daifuku) ఇంట్రాలాజిస్టిక్స్‌ యూనిట్‌కు, నికోమాక్‌ తైకిషా క్లీన్‌ రూమ్స్‌ కంపెనీల ఏర్పాటుకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. అనంతరం మంత్రి మాట్లాడుతూ… అక్కడ వనరులు తక్కువగా ఉంటాయని, అయినప్పటికీ కొద్దిపాటి వనరులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధి చెందుతున్నదని వెల్లడించారు. అణుబాంబు దాడిని ఎదుర్కొని కూడా తిరిగి లేచి నిలిచి జపాన్‌ సత్తా చాటిందన్నారు.

మన దేశంలో ప్రతి ఇంట్లో ఆ దేశానికి చెందిన వస్తువు ఏదో ఒకటి ఉంటుందని చెప్పారు. భవిష్యత్‌లో ఆ దేశానికి చెందిన మరిన్ని కంపెనీలు రాష్ట్రానికి వస్తాయని ఆశిస్తున్నామన్నారు. భారత్‌కు చెందిన వెగా కన్వేయర్స్‌ అండ్‌ ఆటోమేషన్‌ కంపెనీతో కలిసి డైపుకు ఇంట్రాలాజిస్టిక్స్‌ కంపెనీ ఎక్విప్‌మెంట్‌ యూనిట్‌ను ఏర్పాటు చేస్తుందన్నారు. . సంస్థ రూ.575 కోట్లు పెట్టుబడి పెడుతున్నదని, మూడు నెలల్లోనే పరిశ్రమ ప్రారంభం కానుందని వెల్లడించారు. మొదటి దశలో రూ.200 కోట్లు పెట్టుబడి పెట్టనుందని, దీని ద్వారా 800 మందికి ఉపాధి లభించనుండగా.. తొలి దశలోనే 250 మందికి ఉద్యోగాలు కల్పించనున్నారు. దీనిలో కన్వేయర్స్‌, షార్టర్స్‌ ఉత్పత్తి చేయనుందన్నారు. ఇక నికోమాక్‌ తైకిషా లిమిటెడ్‌ కంపెనీకి వందేండ్లకుపైగా చరిత్ర కలిగి ఉందన్నారు. చందన్‌వల్లికి వెల్‌స్పన్‌, మైక్రోసాఫ్ట్‌ సహా అనేక సంస్థలు వస్తున్నాయన్నారు.

Tags:    

Similar News