ప్రపంచదేశాలకు మేడిన్‌ వరంగల్‌ దుస్తులు - మంత్రి కేటీఆర్

Update: 2023-06-17 08:13 GMT

ఉమ్మడి వరంగల్ జిల్లాకు పూర్వవైభవం తీసుకొస్తామని మంత్రి కేటీఆర్ అన్నారు. మరిన్ని పరిశ్రమలు తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తామని చెప్పారు. గీసుకొండ మండలంలోని కాకతీయ మెగా టెక్స్ టైల్ పార్కులో యంగ్ వన్ కంపెనీ వస్త్ర పరిశ్రమకు మంత్రి కేటీఆర్‌ శంకుస్థాపన చేశారు. రూ.900 కోట్ల వ్యయంతో 261 ఎకరాల్లో ఈ టెక్స్‌టైల్‌ పార్కు నిర్మాణాన్ని చేపట్టనున్నారు. భూమిపూజ అనంతనం మాట్లాడిన కేటీఆర్‌.. కాకతీయ టెక్స్‌టైల్ పార్కుకు భూములిచ్చిన రైతులకు కృతజ్ఞతలు చెప్పారు.

పట్టుబట్టి టెక్స్టైల్ పార్క్



తెలంగాణలో నల్ల బంగారంతో పాటు తెల్ల బంగారం కూడా ఉందని మంత్రి కేటీఆర్‌ అన్నారు. రాష్ట్రంలో పండే పత్తి దేశంలోనే నాణ్యమైనదని చెప్పారు. నైపుణ్యం కలిగిన కార్మికులు దగ్గర ఉన్నారని కేటీఆర్ చెప్పారు. అందుకే పట్టుపట్టి మరీ వరంగల్‌లో కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కును ఏర్పాటు చేస్తున్నట్లు స్పష్టం చేశారు. నైపుణ్యం కలిగిన నేతన్నలు ఉన్నందునే వరంగల్‌కు మంచి పేరు వచ్చిందని అన్నారు.

మేడిన్ పరకాల

వరంగల్‌ జిల్లాలో నాణ్యమైన పత్తి పండుతున్నందునే గణేశా కంపెనీ ఇప్పటికే రూ.600 కోట్ల పెట్టుబడి పెట్టిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. యంగ్‌ వన్‌ కంపెనీలో వచ్చే 11 పరిశ్రమల ద్వారా వేల ఉద్యోగాలు వస్తాయని, వాటిలో 99 శాతం జాబ్స్ స్థానికులకే వస్తాయని కేటీఆర్ స్పష్టం చేశారు. కొరియాలో అతిపెద్ద పరిశ్రమ అయిన యంగ్ వన్ కంపెనీ ద్వారా మేడ్‌ ఇన్‌ ఇండియా, మేడ్‌ ఇన్‌ పరకాలగా మారుతుందని కేటీఆర్ అభిప్రాయపడ్డారు. వరంగల్‌లో తయారయ్యే దుస్తులు విదేశాలకు ఎగుమతి అవుతాయని చెప్పారు.

3 కంపెనీల రాకతో 33వేల ఉద్యోగాలు

తెలంగాణలో ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియాలని కేటీఆర్ అన్నారు. దేశంలో వ్యవసాయ, టెక్స్‌టైల్ రంగంలో విస్తృత అవకాశాలున్నప్పటికీ బంగ్లాదేశ్‌, శ్రీలంకలు మనకన్నా ముందున్నాయని మంత్రి అభిప్రాయపడ్డారు. ఈ విషయం ఆలస్యంగా గ్రహించిన కేంద్ర ప్రభుత్వం ఇటీవలే మేల్కొని పీఎం మిత్ర పథకం తీసుకొచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వరంగల్‌ జిల్లాలో రానున్న 3 కంపెనీల ద్వారా 33 వేల ఉద్యోగాలు వస్తాయన్న కేటీఆర్.. చల్లా ధర్మారెడ్డి చొరవతోనే కాకతీయ టెక్స్‌టైల్‌ పార్కు వచ్చిందని చెప్పారు. పరకాలలో ధర్మారెడ్డిపై పోటీ చేయాలంటే భయపడుతున్నారని, నియోజకవర్గాలు మార్చుకొని మరీ వేరే చోటుకు వెళ్తున్నారని చెప్పారు. 

Tags:    

Similar News