మోదీ జీ, అమిత్ షా జీ ఎక్కడున్నారు.. మణిపూర్ ఘటనపై కేటీఆర్ రియాక్షన్
మణిపూర్లో మహిళలను నగ్నంగా ఊరేగించిన ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపింది. అన్ని వర్గాల నుంచి నిందితులను కఠినంగా శిక్షించాలనే డిమాండ్లు వస్తున్నాయి. ఇక ఈ ఘటనపై మంత్రి కేటీఆర్ తీవ్రంగా స్పందించారు. ఈ ఘటన చాలా బాధాకరమన్నారు. దేశంలో అనాగరికత సాధారణంగా ఎలా మారిపోయిందో చెప్పడానికి ఈ ఘటన ఉదాహరణగా నిలుస్తోందన్నారు. మణిపూర్లో శాంతిభద్రతలు పూర్తిగా దెబ్బతిన్న కేంద్రం ఎందుకు మౌనంగా ఉంటుందని ప్రశ్నించారు.
‘‘తాలిబన్లు.. పిల్లలను, మహిళలను హింసించినప్పుడు మనం వారిపై విరుచుకుపడుతున్నాము. ఇప్పుడు మనదేశంలోనే మణిపూర్లో కుకీ తెగ స్త్రీలను మెయిటీలు నగ్నంగా ఊరేగించి లైంగిక వేధింపులకు గురిచేయడం బాధాకరం. కొత్త భారతదేశంలో అనాగరిక చర్యలు విచారకరం. ఈ భయానక హింసాకాండ, శాంతి భద్రతలు పూర్తిగా దెబ్బతినడాన్ని కేంద్రం మౌనంగా చూస్తోంది. ప్రధాని మోదీ జీ.. అమిత్‌షా జీ ఎక్కడ ఉన్నారు? దయచేసి అన్నింటినీ పక్కన పెట్టండి. మీ సమయాన్ని, శక్తిని మణిపూర్‌ను రక్షించడం కోసం వినియోగించండి’’ అంటూ కేటీఆర్ ట్వీట్ చేశారు.
We Indians were raging against Taliban when they were disrespecting children & women
— KTR (@KTRBRS) July 20, 2023
Now in our own country, Kuki women being paraded naked and sexually assaulted by the Meitei mob in Manipur is a distressing & nauseous reminder of how barbarism has been normalised in new India…
కాగా జాతి ఘర్షణలతో అట్టుడుకుతున్న మణిపూర్లో మరో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు నగ్నంగా ఊరేగిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. మహిళలను నగ్నంగా ఊరేగించడంతోపాటు వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మే 4న రాజధాని ఇంఫాల్‌కు 35 కిలోమీటర్ల దూరంలోని కాంగ్‌పోక్పి జిల్లాలో ఈ ఘటన చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇప్పటికే ఒకరిని అరెస్ట్ చేసిన పోలీసులు.. మరికొందరి కోసం గాలిస్తున్నారు.