తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నాయి. ఇవాళ పల్లె, పట్టణ ప్రగతిపై శాసనసభలో స్వల్పకాలిక చర్చ జరిగింది. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి కేటీఆర్ విపక్షాలపై సెటైర్లు వేశారు. కాంగ్రెస్లో నలుగురు ఎమ్మెల్యేలు ఉంటే.. 10మంది సీఎం అభ్యర్థులు ఉంటారని ఎద్దేవా చేశారు. అధికార పీఠం కోసం కొట్లాడే కాకులమందకు తెలంగాణ అభివృద్ధి సింగారం ఎప్పటికీ అర్ధం కాదన్నారు. కర్నాటకలో గెలిస్తే తెలంగాణలో హడావుడి చేయడం కాంగ్రెస్కే దక్కిందని విమర్శించారు.
భట్టి బాధ అర్ధమైంది..
భట్టి విక్రమార్క పాదయాత్ర చేసి అలసిపోయనట్టున్నారు.. అందుకే ఏదేదో మాట్లాడుతన్నారని కేటీఆర్ విమర్శించారు. ‘‘భట్టి సెకన్కో మాట మారుస్తున్నారు. ఆయన కన్ఫ్యూజ్ అయితున్నారు. అటు కాంగ్రెస్కు ఇటు భట్టికి క్లారిటీ లేదు. మీరు ఇక్కడ ఉంటే మీ వెనుక గాంధీ భవన్లో గోతులు తొవ్వుతున్నారు. మీ బాధ మేం అర్ధం చేసుకుంటాం’’ అని కేటీఆర్ సెటైర్స్ వేశారు.
అది నిజం కాదు..
సీఎల్పీనేత భట్టి విక్రమార్క రోజుకో నీళ్ల ట్యాంకర్ తెచ్చుకుంటున్నారన్నది నిజం కాదని కేటీఆర్ అన్నారు. ‘‘ వదినమ్మను అడిగి రమ్మని చెప్పా. కానీ భట్టి అడిగి రాలేదు. జనవరి 2022 నుంచి భట్టి ఒక్క ట్యాంకర్ కూడా బుక్ చేయలేదు. ఆయన ఇంట్లో ఉన్న మీటరు చెడిపోవడం వల్లే రూ.2.90లక్షల బిల్లు కట్టాల్సి వచ్చింది. మీటర్ పనిచేస్తే.. భట్టి ఇంటికి కూడా ఉచిత మంచి నీటి పథకం వర్తించేది’’ అని కేటీఆర్ చెప్పారు. కాంగ్రెస్ పాలనలో కరువు రక్కసి ఇనుప గజ్జెలు కట్టి ఆడిన విలయ తాండవాన్ని ఎవరు మరిచిపోరన్నారు. కాంగ్రెస్ సచ్చిన పాము అని.. ఆ పార్టీని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు.