BRS vs CONGRESS: రూ. 80వేల కోట్ల కాళేశ్వరంలో లక్ష కోట్ల అవినీతి ఎలా..? : కేటీఆర్
రేవంత్ రెడ్డి బీజేపీ కోవర్టు అని మంత్రి కేటీఆర్ అన్నారు. ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఎమ్మెల్యేలను తీసుకోని బీజేపీలోకి వెళ్తాడని ఆరోపించారు. రేవంత్ చార్లెస్ శోభరాజ్ కంటే పెద్ద దొంగ అని ఫైర్ అయ్యారు. ఓటుకు నోటు దొంగను పక్కన పెట్టుకుని రాహుల్ ఏదేదో మాట్లాడుతున్నారని.. గాడ్సేకు గాంధీభవన్ను అప్పజెప్పారని విమర్శించారు. బీఆర్ఎస్ బీజేపీకి బీటీం కాదని.. కాంగ్రెస్ దేశానికి చోర్ టీం అని మండిపడ్డారు.
కాంగ్రెస్ ఆకాశంలోని అగస్టా హెలకాఫ్టర్ నుంచి పాతాళంలోని బొగ్గు దాకా దేని వదలకుండా అన్నింటిని దోచుకుందని కేటీఆర్ ఆరోపించారు. కుటుంబపాలనపై రాహుల్ మాట్లాడడం సిగ్గుచేటని..
కేసీఆర్ది కుటుంబపాలన అయితే మరి రాహుల్ది ఏంటని ప్రశ్నించారు. 80వేల కోట్ల కాళేశ్వరం ప్రాజెక్టులో లక్ష కోట్ల అవినీతి జరిగే అవకాశం ఉందా అని అడిగారు. కాంగ్రెస్ వాళ్లు ఓట్ల కోసం పాట్లు పడుతున్నారని.. కానీ వాళ్లను ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరని చెప్పారు. తెలంగాణభవన్ లో దివ్యాంగుల కృతజ్ఞత సభలో కేటీఆర్ మాట్లాడారు.
అంగవైకల్యం అనేది శరీరానికే కాని మనసుకు కాదని కేటీఆర్ అన్నారు. వికలాంగులకు 4వేల పెన్షన్ ఇస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ అని చెప్పారు. భవిష్యత్తులో పెన్షన్ ను 6వేలకు పెంచుతామన్నారు. దివ్యాంగుల కోసం ఇప్పటివరకు 10,300 కోట్లు ఖర్చు చేసినట్లు వివరించారు. తెలంగాణలో 5 లక్షల 65వేల వికలాంగులు ఉన్నారని.. ఒక్కో వికలాంగుడు బీఆర్ఎస్ కు 10ఓట్లు వేయించాలని పిలుపునిచ్చారు. కేసీఆర్ లాంటి నాయకుడు శతాబ్దానికి ఓసారి మాత్రమే వస్తాడని.. మోదీకి, రాహుల్కు బుద్ధి వచ్చేలా వికలాంగులు పనిచేయాలని స్పష్టం చేశారు.