తెలంగాణలో సంక్షేమం సముద్రమంత.. అభివృద్ధి ఆకాశమంత అని కేటీఆర్ అన్నారు. రాష్ట్రంలో సంక్షేమం, సంతోషం తప్ప.. సంక్షోభం లేదని చెప్పారు. శాసనసభలో పల్లె, పట్టణ ప్రగతిపై స్వల్పకాలిక చర్చ సందర్భంగా మంత్రి మాట్లాడారు. రాష్ట్ర బడ్జెట్ అంటే విపక్షాలకు జమ ఖర్చుల లెక్క మాత్రమే అని.. కానీ బీఆర్ఎస్‌కు బడ్జెట్ అంటే రాష్ట్ర ప్రజల జీవనరేఖ అని చెప్పారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పల్లె, పట్టణ ప్రగతి కార్యక్రమాలతో తెలంగాణలో పల్లె మురిసింది.. పట్టణం మెరిసింది అని కేటీఆర్ అన్నారు. పల్లెల్లో హార్వస్టర్లు, పట్టణంలో ఇన్వెస్టర్లు పరుగులు పెడుతున్నట్లు తెలిపారు. తెలంగాణ నమూనా అంటే సమగ్ర, సమ్మిళిత అభివృద్ధి అని చెప్పారు. రాష్ట్రంలో వ్యవసాయం, పారిశ్రామిక రంగం, సేవా రంగం దూసుకుపోతున్నాయని అన్నారు.
ఒక వైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే.. మరో వైపు మౌలిక వసతులకు భారీగా కేటాయింపులు చేస్తున్నట్లు తెలిపారు. రాష్ట్రం ఏర్పడక ముందు తెలంగాణ పరిస్థితి దారుణంగా ఉండేదని కేటీఆర్ అన్నారు. ప్రస్తుతం మౌలిక వసతులపై బడ్జెట్‌లో 26శాతం ఖర్చు పెడుతున్నట్లు చెప్పారు. మౌలిక వసతుల కల్పనలో గ్రామాలు, పట్టణాలకు సమప్రాధాన్యం ఇస్తున్నామన్నారు.