మంత్రి కేటీఆర్ రెండు రోజుల పాటు ఢిల్లీలో పర్యటించనున్నారు. వివిధ ప్రాజెక్టులు, పథకాలు, పెండింగ్ ప్రాజెక్టులపై కేంద్రమంత్రులతో చర్చిస్తారు. ఒకవేళ పెండింగ్ అంశాలపై కేంద్రం నుంచి స్పష్టమైన హామీ రాకపోతే మోదీ సర్కారు వైఖరిని ఎండగట్టాలని కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయించినట్లు సమాచారం. రాష్ట్ర అభివృద్ధిపై కేంద్రం తీరును ప్రజలకు వివరించి, బీజేపీ నిజస్వరూపాన్ని బట్టబయలు చేయాలని ప్రణాళిక రూపొందించినట్లు తెలుస్తోంది.
రసూల్‌పుర వద్ద చేపట్టిన రోడ్డు అభివృద్ధికి హోంశాఖ పరిధిలో ఉన్న భూముల కోసం హోంమంత్రి అమిత్‌షాను కేటీఆర్ కలుస్తారు. ఈ సమావేశంలో రాజకీయ అంశాలపై కూడా చర్చించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తోంది. గత కొన్నాళ్లుగా బీజేపీ, బీఆర్ఎస్ ఉప్పు నిప్పుగా ఉంటున్నాయి. ఇప్పటికే బీజేపీపై యుద్ధం ప్రకటించిన కేసీఆర్.. ఆ దిశగా జాతీయ రాజకీయాల్లోకి అడుగులు వేస్తున్నారు. ఈ క్రమంలో కేటీఆర్ - అమిత్ షా భేటీ ప్రాధాన్యతను సంతరించుకుంది
హైదరాబాద్‌లో ఎస్సార్డీపీలో భాగంగా చేపట్టిన స్కైవేల నిర్మాణానాకి కంటోన్మెంట్ భూములు కావాలని రాష్ట్రం కోరుతున్నా కేంద్రం నుంచి ఎలాంటి స్పందన లేదు. ఈ క్రమంలో ఆయన రాజ్నాథ్ సింగ్తో సమావేశమై.. ఈ అంశంపై చర్చిస్తారు. వరంగల్ వద్ద ఉన్న మామునూరు ఎయిర్‌పోర్ట్‌పై కేంద్రం ఎటువంటి నిర్ణయం తీసుకోలేదు. ఈ అంశంపై కేంద్ర పౌర విమానయానశాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింథియా లేదా వీకే సింగ్‌తో సమావేశమై స్పష్టమైన నిర్ణయం ప్రకటించాలని కోరే అవకాశం ఉంది.