రెండోదశ పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి పర్యావరణ అనుమతుల విషయాన్ని కేంద్రం ఎటూ తేల్చకపోవడంపై మంత్రి కేటీఆర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ సాగునీటి ప్రాజెక్టుల విషయంలో కేంద్ర ప్రభుత్వం వివక్ష చూపిస్తోందని ఆరోపించారు. దీనిపై కేంద్రానికి ఆయన బహిరంగ లేఖ రాశారు. రాష్ట్ర ప్రగతిని చూసి ఓర్వేలేక తన పరిధిలో ఉన్న అంశాలను సైతం తేల్చకుండా అభివృద్ధిని అడ్డుకునే ప్రయత్నం చేస్తోందని విమర్శించారు.
తెలంగాణపై కేంద్రం అనుసరిస్తున్న వివక్ష పట్ల తీవ్ర నిరాశతో ఈ లేఖ రాస్తున్నట్టు కేటీఆర్ పేర్కొన్నారు. కరవు పీడిత ప్రాంతాలైన ఉమ్మడి మహబూబ్‌నగర్, రంగారెడ్డి, నల్గొండ జిల్లాలకు ఈ ప్రాజెక్టు ఆశాకిరణమన్నారు. 12లక్షలకు పైగా ఎకరాలకు సాగునీరు, హైదరాబాద్ సహా ప్రజలకు తాగునీరు, పరిశ్రమల నీటి అవసరాలను తీర్చే బహుళార్థక ప్రాజెక్టు నిర్మాణానికి కేంద్రం అడ్డంకులు సృష్టించడం శోచనీయమని మండిపడ్డారు.
ప్రాజెక్టు పూర్తయితే లక్షలాది ఎకరాలు సాగులోకి రావడంతో పాటు, కోట్లాది ప్రజల జీవితాల్లో గుణాత్మక మార్పు వస్తుందని కేటీఆర్ వివరించారు. మిషన్ భగీరథతో నల్లగొండ ఫ్లోరైడ్ భూతాన్ని తరిమికొట్టిన తమ ప్రభుత్వం.. నల్లగొండ, మహబూబ్ నగర్, రంగారెడ్డి జిల్లాలను మరింత సస్యశ్యామలం చేసేందుకు పాలమూరు - రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి శ్రీకారం చుట్టిందని తెలిపారు.
కర్ణాటకలోని అప్పర్ భద్ర ప్రాజెక్టుకు జాతీయ హోదాను ఇస్తూ వేగంగా అనుమతులు ఇచ్చి.. పాలమూరు – రంగారెడ్డికి జాతీయ హోదా నిరాకరించడం ఎంత వరకు న్యాయమని ప్రశ్నించారు.
కృష్ణా నదిలో 500 టీఎంసీల నీటి వాటాను తెలంగాణకు రావాల్సి ఉందన్నారు. తొమ్మిదేళ్లు గడుస్తున్నా ట్రిబ్యునల్ నీటివాటాలను తేల్చలేదన్నారు. అదేవిధంగా రాష్ట్ర ఏర్పాటును ప్రశ్నించేలా ప్రధాని మోదీ పలుమార్లు మాట్లాడారని మండిపడ్డారు. కేంద్రం ఆటంకాలను దాటుకొని.. తనదైన సంక్షేమ కార్యక్రమాలతో తెలంగాణ దేశానికే ఆదర్శంగా నిలుస్తూ ముందుకు సాగుతోందని వివరించారు.
ఇదేం న్యాయం?
— KTR (@KTRBRS) July 13, 2023
అన్ని హామీలు ఇచ్చిన తెలంగాణ.
అయినప్పటికీ...
పాలమూరు - రంగారెడ్డి ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి నిరాకరణ!
కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వానికి ఆది నుంచీ తెలంగాణపై కక్ష
మన రాష్ట్ర ప్రాజెక్టులపై అంతులేని వివక్ష.
అమ్మ పెట్టదు
అడుక్కు తిననివ్వదు అన్నట్టు
సాగు, తాగు నీటి… pic.twitter.com/ECj6vNPP7C