గత బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రాజెక్టులపై దోపిడికి పాల్పడిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అన్నారు. ప్రాజెక్టులు త్వరగా కట్టాలనే ఆతృత తప్ప నాణ్యతను పట్టించుకోలేదని ఆరోపించారు. శాసనసభలో నీటిపారుదల శాఖపై శ్వేత పత్రం విడుదల సందర్భంగా జరిగిన చర్చలో ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ హయాంలోనే మేడిగడ్డ కుంగిపోయిందన్న మంత్రి.. ఎన్నికలకు ముందు మేడిగడ్డలో నీటిని ఎందుకు నిల్వ చేయలేదని ప్రశ్నించారు. డిజైన్ మార్చడమే ఆ ప్రాజెక్టుకు శాపంగా మారిందని విమర్శించారు.
అప్పుడు దేవాలయంగా ఉన్న మేడిగడ్డ ఇప్పుడు బొందలగడ్డగా మారిందా అని పొంగులేటి ప్రశ్నించారు. కేసీఆర్ సభకు రావాలని పొంగులేటి అన్నారు. ప్రాజెక్టుపై పూర్తి అవగాహన ఉన్న కేసీఆర్.. ఈ సమస్యలకు పరిష్కారం చూపే ఛాన్స్ ఉంటుందన్నారు. కాళేశ్వరంలో పలు రిజర్వాయర్లు కట్టిన కేసీఆర్ సర్కార్ ఉమ్మడి ఖమ్మం జిల్లాలోని సీతారామ ప్రాజెక్టులో ఒక్క రిజర్వాయర్ కూడా ఎందుకు కట్టలేదని నిలదీశారు. సీతారామ ప్రాజెక్టులో రిజర్వాయర్లు ఎందుకు కట్టలేదో చెప్పాలన్నారు. తమ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని.. తమని విమర్శించే హక్కు బీఆర్ఎస్కు లేదని అన్నారు.