Tammineni Veerabhadram: తమ్మినేని వీరభద్రంను పరామర్శించిన కాంగ్రెస్ మంత్రులు
గుండె, కిడ్నీ, ఊపిరితిత్తుల సంబంధిత సమస్యతో బాధపడుతున్న సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం.. హైదరాబాద్‌లోని ఏఐజీ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సంగతి తెలిసిందే. డాక్టర్ల పర్యవేక్షణలో మెరుగైన చికిత్స పొందుతున్న తమ్మినేని ఇప్పుడిప్పుడే కోలుకుంటున్నారు. గురువారం ఆయన్ను ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, రెవిన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాసరావులు విడివిడిగా పరామర్శించారు. వైద్యులను అడిగి ఆయన ఆరోగ్య పరిస్థితిపై తెలుసుకున్నారు. మెరుగైన వైద్య సేవలు అందించి త్వరగా కోలుకునేలా కృషి చేయాలని డాక్టర్లకు సూచించారు. తమ్మినేని వీరభద్రం సంపూర్ణ ఆరోగ్యంతో త్వరగా కోలుకొని ప్రజా క్షేత్రంలోకి రావాలని ఆకాంక్షించారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెంట మునుగోడు శాసనసభ్యులు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ కమిటీ కో కన్వీనర్ అజ్మతుల్లా తదితరులు ఉన్నారు
ఇక ఏఐజీ ఆస్పత్రి వర్గాలు తమ్మినేని ఆరోగ్యంపై బుధవారం హెల్త్ బులెటిన్ ను విడుదల చేశారు. ‘తమ్మినేని వీరభద్రం ప్రాథమిక చికిత్సకు స్పందిస్తు న్నారు. ఆయన ఆరోగ్యం స్థిరంగా ఉంది. కొద్దిపాటి మందుల సహాయంతో బీపీ స్థిరంగా ఉంది. మాట్లాడిస్తుంటే స్పందిస్తున్నారు. తదుపరి 24-48 గంటలు చాలా కీలకమైనవి. ఆస్పత్రి క్రాస్ ఫంక్షనల్ వైద్యుల బృందం ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూనే ఉన్నది. అందుకనుగుణంగా నిరంతర వెంటిలేటర్ అవసరంతో సహా భవిష్యత్ చికిత్సను కొనసాగిస్తారని వైద్యులు నిర్ధారించారు.’అని తెలిపారు.
ఇదిలా ఉండగా.. సీపీఐ(ఎం) పొలిట్‌బ్యూరో సభ్యులు రాఘవులు... ఆస్పత్రికి వెళ్లి తమ్మినేని వీరభద్రం ను పరామర్శించారు. ఆయన ఆరోగ్యం గురించి డాక్టర్లను అడిగి వివరాలు తెలుసుకున్నారు. అనంతరం రాఘవులు మీడియాతో మాట్లాడుతూ ఆయన ఆరోగ్యం వేగంగా మెరుగుపడుతున్నదని చెప్పారు. రెండు రోజుల్లో పూర్తిగా కోలుకుంటారని డాక్టర్లు చెప్తున్నారని అన్నారు. ఆయన కోలుకోవడం చాలా సంతోషకరమైన విషయమన్నారు. బీపీ స్థిరంగా ఉందనీ, మూత్ర పిండాలు, గుండె సాధారణ స్థితిలో ఉన్నాయని వివరించారు. అయితే సందర్శకులు ఎక్కువగా వస్తున్నారనీ, అలా రావడం వైద్యులకు, ఆయనకు ఇబ్బందికరంగా మారిందని చెప్పారు. ఆయన త్వరగా కోలుకోవాలంటే సందర్శకుల సంఖ్య ఎంత తక్కువుంటే అంత మంచిదని అన్నారు. శ్రేయోభిలాషులు, మిత్రులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆరోగ్యం గురించి ఆందోళన పడొద్దని అన్నారు.