హైదరాబాద్ లోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సచివాలయంలో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో రవాణా, బీసీ సంక్షేమ శాఖల మంత్రి పొన్నం ప్రభాకర్ భేటీ అయ్యారు. ఆయనతో పాటు టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ ఇతర అధికారులు ఉన్నారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం, పొన్నం ప్రభాకర్ ఆర్టీసీ అధికారులతో రివ్యూ నిర్వహించారు. ఈ నేపథ్యంలో టీఎస్ఆర్టీసీ ఆర్థిక పరమైన అంశాలు, మహాలక్ష్మి పథకం అమలు తీరు, ప్రభుత్వ ఆర్థిక సహాయం, తదితర విషయాలను పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వారికి సంస్థ ఉన్నతాధికారులు వివరించారు. ఈ సందర్భంగా తెలంగాణ ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క మాట్లాడుతూ.. ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహాలక్ష్మి-మహిళలకు ఉచిత బస్సు సౌకర్య పథకాన్ని విజయవంతంగా అమలు చేస్తున్న టీఎస్ఆర్టీసీ సిబ్బంది, అధికారులను అభినందించారు. ఈ స్కీం కింద ఇప్పటివరకు 6.50 కోట్ల మంది మహిళలు ప్రయాణాలు సాగించడం గొప్ప విషయమని, ఈ స్కీమ్ ను ఇలానే ప్రశాంత వాతావరణంలో అమలయ్యేలా చర్యలు తీసుకోవాలన్నారు.
టీఎస్ఆర్టీసీకి ఆర్థిక శాఖ తరపున పూర్తి సహాయ, సహకారాలు అందిస్తామన్నారు. నిర్వహణ వ్యయం మేరకు కావాల్సిన నిధులను సంస్థకు సమకూర్చాలని ఆర్థిక శాఖ అధికారులకు ఆదేశాలు ఇచ్చామని చెప్పారు. సిబ్బందికి రావాల్సిన బకాయిలు, సంస్థ అప్పులు, పీఎఫ్, సీసీఎస్, ఇతర సెటిల్ మెంట్లకు సంబంధించిన నిధులపై సమీక్షించి.. త్వరలోనే నిర్ణయం తీసుకుంటామని చెప్పారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపైన సంస్థ దృష్టి పెట్టి.. నిర్వహణ సామర్థ్యాన్ని పెంచుకోవాలని అధికారులకు సూచించారు. మహాలక్ష్మి పథకం కింద ప్రతి రోజు సగటున 27 లక్షల మంది మహిళలు ప్రయాణిస్తున్నారని, దాదాపు రూ.10 కోట్ల విలువైన జీరో టికెట్లను మంజూరు చేస్తున్నామని ఆర్టీసీ ఉన్నతాధికారులు వివరించగా.. రోజు వారీ నిర్వహణకు అవసమైన నిధులను ప్రభుత్వం సమకూర్చుతుందని డిప్యూటీ సీఎం హామీ ఇచ్చారు.
అనంతరం మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ.. ఆర్టీసీ ప్రజల సంస్థ అని.. దీనిని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం తీసుకుంటుందన్నారు. సంస్థను బలోపేతం చేయడానికి కావాల్సిన అన్ని చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రత్యామ్నాయ ఆదాయ మార్గాలపై సంస్థ ఆలోచిస్తోందని, టికెట్ ఆదాయంపైనే కాకుండా.. లాజిస్టిక్స్, కమర్షియల్, తదితర టికేటేతర ఆదాయంపైనా సంస్థ దృష్టి పెట్టిందని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి రామకృష్ణా రావు, టీ ఆర్ అండ్ బీ ముఖ్య కార్యదర్శి శ్రీనివాస రాజు, టీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్, ఉప ముఖ్యమంత్రి ఓఎస్డీ కృష్ణ భాస్కర్, టీఎస్ఆర్టీసీ ఈడీలు ముని శేఖర్, కృష్ణ కాంత్, ఫైనాన్స్ అడ్వజర్ విజయ పుష్ప, సీఎంఈ రఘునాథరావు, సీటీఎం జీవన ప్రసాద్, తదితరులు పాల్గొన్నారు.