లారీ డ్రైవర్లు తలపెట్టిన సమ్మెను విరమించుకోవాలని మంత్రి పొన్నం ప్రభాకర్ సూచించారు. హిట్ అండ్ రన్‌కి సంబంధించిన కొత్త సెక్షన్ను ఇప్పట్లో చేయమని కేంద్రం ఇప్పటికే ప్రకటించిందని.. దీనిని గమనించాలని మంత్రి కోరారు. ఒకవేళ భవిష్యత్‌లో అమలు చేయాల్సి వస్తే డ్రైవర్లు, లారీ యజమానులతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకుంటారని చెప్పారు. అయినా సరే కొన్ని గుర్తింపు లేని సంఘాలు బుధవారం నుంచి సమ్మె చేయాలని భావిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని.. దీనిని వెంటనే విరమించుకోవాలని కోరారు.
ఈ సమ్మెను గుర్తింపు సంఘాలతో పాటు చాలా మంది వ్యతిరేకిస్తున్నారని పొన్నం అన్నారు. లారీ డ్రైవర్లు సమ్మె చేస్తే సామాన్యులు ఇబ్బందులు పడతారని.. దీనిని ఆలోచించాలని కోరారు. అయినా ఇది కేంద్రం పరిధిలోనిదని.. రాష్ట్రానికి దీంతో ఎటువంటి సంబంధం లేదని స్పష్టం చేశారు. కాగా గతంలోనూ లారీ డ్రైవర్లు సమ్మె చేపట్టారు. కేంద్ర ప్రభుత్వం కొత్తగా తీసుకువచ్చిన భారత న్యాయ సంహిత చట్టంలో హిట్ అండ్ రన్ కేసులకు సంబంధించి కఠిన నిబంధనలు చేర్చడంతో దేశవ్యాప్తంగా లారీ డ్రైవర్లు ఆందోళన చేపట్టారు. కొత్త రూల్ ప్రకారం.. హిట్ అండ్ రన్ కేసుల్లో పదేళ్ల జైలు శిక్ష, రూ.7 లక్షల వరకు ఫైన్ విధించేలా కొత్త కేంద్రం నిబంధన తీసుకువచ్చింది.