తెలంగాణలో కొలువుదీరనున్న ‘కల్లు బార్లు’

By :  Krishna
Update: 2024-03-03 14:36 GMT

తెలంగాణలో కల్లు బార్లు కొలువుదీరనున్నాయి. రానున్న రోజుల్లో కల్లు బార్లు ఏర్పాటు చేసే దిశగా కార్యచరణ రూపొందిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ చెప్పారు. ఆదివారం (మార్చి 3) మహబూబ్ నగర్ లో ఏర్పాటుచేసిన గౌడ సంఘం ఆత్మీయ సమ్మేళనంలో.. ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావుతో కలిసి పాల్గొన్న పొన్నం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో వివిధ కుల వృత్తులు మారుతున్నాయని అన్నారు. అన్ని రకాల వ్యాపారుల తీరు మారుతుందని చెప్పారు. వాటితో పాటు గీత కార్మికుల వృత్తిని కూడా ఆధునీకరించాలనే ఆలోచనలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉందన్నారు. అందులో భాగంగానే కల్తీ కల్లు లేకుండా అమ్మే విధంగా ప్రభుత్వం కార్యచరణ తీసుకొస్తుందని వివరించారు.

ఈ సందర్భంగా మాట్లాడిన ఆయన కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 90 రోజులైందని గుర్తుచేశారు. కాంగ్రెస్ ఆరు గ్యారెంటీల్లో ఒకటైన మహిళలకు ఫ్రీ బస్సు జర్నీ ద్వారా ఇప్పటికే 20 కోట్ల మందికి లబ్ధి చేకూరిందన్నారు. ప్రజా సమస్యలు నెరవేరాలంటే కేంద్రంలో కూడా కాంగ్రెస్ పార్టీ ఉండాలని, లోక్ సభ ఎన్నికల్లో పార్టీని గెలిపించాలని కోరారు. ఎంఎల్సీ, ఎంపీ ఎన్నికల్లో ఓట్లు అడిగే అర్హత కేసీఆర్ కు లేదని విమర్శించారు.

Tags:    

Similar News