Ponnam prabhakar: సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై కేటీఆర్ కామెంట్స్‌కు మంత్రి పొన్నం కౌంటర్
సర్పంచ్‌ల పెండింగ్ బిల్లులపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన వ్యాఖ్యలకు సోషల్ మీడియా వేదికగా మంత్రి పొన్నం ప్రభాకర్ స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. హంతకులే సంతాప సభ పెట్టినట్టుగా ఉందంటూ కేటీఆర్‌పై పొన్నం సెటైర్ వేశారు. 10 సంవత్సరాల మీ పాలనలో సర్పంచ్‌లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా? అని సిరిసిల్ల ఎమ్మెల్యే కేటీఆర్‌ను మంత్రి ప్రశ్నించారు. సర్పంచ్‌లను పనుల పేరుతో సస్పెన్షన్‌ల పేరుతో వేధించింది నిజం కాదా? అని నిలదీశారు. ఇప్పుడు మళ్లీ ఆత్మీయ సమ్మేళనలా పేరుతొ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరూ నమ్మరు కేటీఆర్ అంటూ వ్యాఖ్యానించారు. మీ హయాంలో సర్పంచ్‌లకు ఇవ్వాల్సిన రూ.1100 కోట్ల బిల్లులు పెండింగ్‌లో పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీఆర్‌ఎస్ హయాంలో 20 మంది సర్పంచ్‌లు ఆత్మహత్యలు చేసుకున్నారని మంత్రి పొన్నం ప్రభాకర్ ఆవేదన వ్యక్తం చేశారు.
హంతకులే సంతాప సభ పెట్టినట్లు వుంది..
— Ponnam Prabhakar (@PonnamLoksabha) January 18, 2024
10 సంవత్సరాల మీ పాలన లో సర్పంచ్ లు బిల్లులు రాక ఆత్మహత్యలు చేసుకున్నది నిజం కాదా...
సర్పంచ్ లని పనుల పేరుతొ సస్పెన్షన్ ల పేరుతొ వేదించింది నిజం కాదా...?
ఇప్పుడు మళ్లీ ఆత్మీయ సమ్మేళనలా పేరుతొ రాజకీయాలకు తెరలేపితే మిమ్మల్ని ఎవరు నమ్మరు… pic.twitter.com/346gg0Guso
కాగా మంగళవారం సిరిసిల్లలోని బీఆర్‌ఎస్ ఆఫీస్‌లో నిర్వహించిన జిల్లా సర్పంచుల ఆత్మీయ సమావేశంలో పాల్గొన్న కేటీఆర్..‘‘ కరోనా కారణంగా సర్పంచులకు బిల్లులు చెల్లించలేకపోయాం. వాటిని ఈ సర్కారు ఇస్తుందని ఆశిస్తున్నాం. లేదంటే మీ తరఫున గొంతు విప్పడానికి నేను సిద్ధంగా ఉంటా’’ అని అన్నారు. ఈ నేపథ్యంలోనే కేటీఆర్‌కు మంత్రి పొన్నం ప్రభాకర్ కౌంటర్ ఇచ్చారు. కాగా సర్పంచుల ఆత్మీయ సమావేశంలో కేటీఆర్ మాట్లాడుతూ.. తమ హయాంలో 1,858 తండాలను గ్రామ పంచాయతీలుగా ఏర్పాటు చేశామని, కొత్తగా 9,355 గ్రామ పంచాయతీ సెక్రటరీలను నియమించారని తెలిపారు. అలాగే స్థానిక సంస్థల అభివృద్ధి కోసం నూతనంగా అడిషనల్ కలెక్టర్ పోస్ట్‌ను కూడా సృష్టించామని చెప్పుకొచ్చారు.