BRS Manifesto 2023: కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ 6 గ్యారంటీలు ఫినిష్.. మంత్రి పువ్వాడ

Update: 2023-10-17 07:48 GMT

రాబోయే ఎన్నికల్లో బీఆర్ఎస్ హ్యాట్రిక్ విక్టరీ కొడుతుందని మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ ధీమా వ్యక్తం చేశారు. ఈసారి కూడా తమ పార్టీకి 88 నుంచి 90 స్థానాలు వస్తాయని తెలిపారు. ఖమ్మం బీఆర్ఎస్ కార్యాలయంలో పువ్వాడ అజయ్ కుమార్ తో పాటు అభ్యర్థులు మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అజయ్ కుమార్ మాట్లాడుతూ.. బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో పలు సంక్షేమ పథకాలు, నిధులు తీసుకొచ్చామని, పోడు భూములకు పట్టాలిచ్చామని ఈ సారి జిల్లా ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని సూచించారు. ప్రత్యర్థి పార్టీలు అభ్యర్థులు తేల్చుకోలేక పోతున్నారు అంటూ ఎద్దేవా చేశారు. గత ఎన్నికల ఫలితాలకు భిన్నంగా ఈసారి ఖమ్మంలో పది స్థానాలలో బీఆర్ఎస్ గెలుచుకుంటుందన్నారు. తమకు ప్రధాన ప్రత్యర్ధి కాంగ్రెస్సే అన్నారు.

తాము అమలుచేస్తున్న అనేక పథకాలను కాంగ్రెస్‌ తన మ్యానిఫెస్టోలో పెట్టిందని విమర్శించారు. తాము ఇస్తున్న రైతుబంధును (Rythu Bandhu) కాపీ కొట్టారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ‘‘మాకు ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీ నే. మా స్కీమ్‌లను కాంగ్రెస్ కాపీ కొట్టింది. రివర్స్‌గా మేమే కాంగ్రెస్ పథకాలను కాపీ కొడుతున్నారని కొత్త డ్రామాలాడుతున్నారు. అంతే కాకుండా గతంలో కేంద్ర ప్రభుత్వం తమ పథకాలను కాపీ కొట్టింది’’ అంటూ విరుచుకుపడ్డారు. ఆసరా పింఛను (Aasara Pension) పథకం బీఆర్‌ఎస్‌దా లేదా కాంగ్రెస్‌ పార్టీదా అని ఆలోచించాలన్నారు. సీఎం కేసీఆర్ మ్యానిఫెస్టోతో కాంగ్రెస్ ఆరు గ్యారంటీ లు పని అయిపోయిందని..కాంగ్రెస్ ధీమా భీమా కల్పించ లేకపోయింది అంటూ ఎద్దేవా చేశారు. ఖమ్మంజిల్లా ప్రజలు ఆలోచించుకుని ఓటు వేయాలని సూచించారు. కేసీఆర్ ప్రభుత్వాన్ని ఆశీర్వదించాలని కోరారు.

Tags:    

Similar News