సాయిచంద్ భార్యకు కోటి చెక్కు అందించిన మంత్రి
సాయిచంద్ అకాల మరణం బీఆర్ఎస్ పార్టీ సహా అందరినీ కలిచి వేసింది. బీఆర్ఎస్ గొంతుగా మారి ఆయన పాడిన పాటలు రాష్ట్రవ్యాప్తంగా మార్మోగాయి. చిన్న వయస్సులోనే గుండెపోటుతో ఆయన మరణించగా.. ఆయన సతీమణికి గిడ్డంగుల కార్పొరేషన్ చైర్మన్ పదవి ఇచ్చింది ప్రభుత్వం. అంతేకాకుండా ఆయన కుటుంబానికి కోటిన్నర ఆర్థిక సాయం ప్రకటించింది. ఈ క్రమంలో కోటి రూపాయల చెక్కును మంత్రి సబితా ఇంద్రారెడ్డి వారికి అందించారు.
ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్ రెడ్డి, ఎమ్మెల్సీ దాసోజు శ్రవణ్ తో కలిసి సాయిచంద్ ఇంటికి వెళ్లిన సబితా.. రజినీకి చెక్కును అందించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో తన పాటలతో సాయిచంద్ తెలంగాణ ప్రజల గుండె చప్పుడుగా నిలిచారని సబితా కొనియాడారు. ఆయన మరణం బీఆర్ఎస్ పార్టీకి తీరని లోటన్నారు. భర్తను కోల్పోయిన రజనీ బాధ ఎలా ఉంటుందో తనకు తెలుసని చెప్పారు. సాయిచంద్ కుటుంబానికి అండగా నిలిచిన కేసీఆర్కు ధన్యవాదాలు తెలిపారు. మరోవైపు సాయిచంద్ తల్లిదండ్రులు, సోదరికి మంత్రి శ్రీనివాస్ గౌడ్, ఎమ్మెల్యే బాల్కసుమన్ చెక్ అందజేశారు. తండ్రికి 25లక్షలు, సోదరికి రూ. 25 లక్షలను వారు అందించారు.