మేడారం జాతరకు జాతీయ హోదా కోసం కృషి చేస్తామని మంత్రి సీతక్క తెలిపారు. రాష్ట్ర బడ్జెట్కు కేంద్ర నిధులు తోడైతే జాతరను మరింత ఘనంగా నిర్వహించుకోవచ్చన్నారు. ఫిబ్రవరిలో జరిగే మహాజాతరకు ఘనంగా ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆమె ఆదేశించారు. మేడారం జాతరపై ఉన్నతాధికారులతో ఆమె సమీక్ష నిర్వహించారు. జాతరలో పారిశుధ్యం, విద్యుత్ తాగునీరు సహా పలవు వసతుల కల్పనపై అధికారులకు పలు సూచనలు చేశారు.
గిరిజన సంక్షేమ శాఖ తనకు తల్లివంటిదని.. ఈ శాఖ ఉద్యోగులు తనను సోదరిలా భావించి తమ సమస్యలను ఎప్పుడైనా చెప్పుకోవచ్చని భరోసా ఇచ్చారు.
గతంలో జాతరకు 2 నెలల ముందు నిర్వహించే కోయ గిరిజన ఇలవేల్పుల సమ్మేళనాన్ని ఈసారి జాతర సమయంలోనే జరిగేలా చూడాలని అధికారులకు సీతక్క సూచించారు. తద్వారా భక్తులకు గిరిజన సాంస్కృతిక వైభవం గురించి బాగా తెలుస్తుందని అభిప్రాయపడ్డారు. అదేవిధంగా పంచాయతీ రాజ్ శాఖ అధికారులతోనూ ఆమె సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు నిత్యం ఉపయోగపడే కార్యక్రమాలపై సమర్థంగా పని చేయాలని చెప్పారు.