మంత్రులు పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి, సీతక్క మేడారం జాతరపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి పొంగులేటి.. జాతరకు రెండు కోట్ల మంది భక్తులు వస్తారని అంచనా వేస్తున్నట్లు తెలిపారు. అందరికీ అందుబాటులో ఉండేలా అదనపు బస్సులు ఏర్పాటు చేస్తామని చెప్పారు. అనంతరం మాట్లాడిన సీతక్క.. ఎప్పటికప్పుడు జాతర వివరాలు సేకరిస్తూ బడ్జెట్ కేటాయిస్తున్నట్లు వివరించారు. జాతరకు వచ్చే వీఐపీలు వారి వాహనాలను ములుగులోనే ఉంచి.. బస్సుల్లో రావాలని సూచించారు. ప్రభుత్వం ఖనానా నుంచి జాతరకు ఖర్చు చేసే ప్రతి రూపాయి వివరాలు ప్రజల ముందుంచుతామని స్పష్టం చేశారు. సమ్మక్క-సారలమ్మ చరిత్రను శిలాశాసనం చేసి మేడారంలో ఏర్పాటు చేస్తామని సీతక్క చెప్పుకొచ్చారు.
జాతరకు ఎన్ని లక్షల మంది వచ్చినా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. భక్తుల రద్దీ దృష్ట్యా ఎక్కవ మంది పారిశుద్ధ్య కార్మికులను మేడారంలో ఉంచామన్నారు. జాతర పర్యవేక్షణ కోసం ఐఏఎస్, ఐపీఎస్ స్థాయి అధికారులను నియమించినట్లు సీతక్క చెప్పారు. భక్తులకు ఏవైనా ఇబ్బందులుంటే ఫిర్యాదు చేయాలని, ప్రజలకు ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.