సమయం వృథా కాకుండా సభను నడిపించే ప్రయత్నం చేశాం : Sridhar Babu
అసెంబ్లీ సమావేశాల్లో అర్ధవంతమైన చర్చ జరిగిందని మంత్రి శ్రీధర్ బాబు తెలిపారు. అసెంబ్లీలో మూడు కీలక బిల్లులు ఆమోదం పొందాయని చెప్పారు. సమయం వృథా కాకుండా సభను నడిపించే ప్రయత్నం చేశామన్నారు. చరిత్రలో నిలిచే ఘట్టం ఈ సభలో జరిగిందని చెప్పారు. రాహుల్ గాంధీ ఆకాంక్షించినట్లు కులగణన తీర్మానాన్ని ఆమోదించినట్లు తెలిపారు. బడుగు బలహీన వర్గాల వారీకి నిధులు విధులు ఇచ్చేలా మొదటి అడుగు పడిందని అభిప్రాయపడ్డారు.
అసెంబ్లీ సమావేశాల్లో 59 మంది సభ్యులు చర్చల్లో పాల్గొన్నారని శ్రీధర్ బాబు తెలిపారు. జీరో అవర్‌లో 64 మంది సభ్యులు తమ ప్రాంత సమస్యలను ప్రభుత్వం దృష్టికి తెచ్చారన్నారు. 8 రోజుల్లో 45 గంటల 32 నిమిషాల పాటు సభ జరిగిట్లు తెలిపారు. ఈ సమావేశాల్లో కాంగ్రెస్ సభ్యులకు 8గంటల 43 నిమిషాల టైం కేటాయిస్తే.. బీఆర్ఎస్ సభ్యులకు 8గంటల 41 నిమిషాలు కేటాయించినట్లు చెప్పారు. అదేవిధంగా బీజేపీకి 3గంటల 48 నిమిషాలు, ఎంఐఎంకి 5గంటలు, సీపీఐకి 2గంటల 55 నిమిషాల సమయం కేటాయించినట్లు వివరించారు. కాగా అసెంబ్లీ నిరవధిక వాయిదా పడింది.